మన పోలీస్ ను ‘హీరో’గా గుర్తించిన అమెరికా

Update: 2017-06-29 07:39 GMT
రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ కు అరుదైన పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా నిరోధానికి కృషి చేసేవారికి అమెరికా ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక హీరో అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.
    
పదమూడేళ్లుగా మానవ అక్రమ రవాణా నిర్మూలనకు మహేశ్ భగవత్ చేస్తున్న విశేష కృషికి గాను ఈ అవార్డు వరించింది. వివిధ ప్రభుత్వ సంస్థలు - సామాజిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ మహేశ్ చాలాకాలంగా మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఎందరో బాధితులకు విముక్తి కల్పించారు. రాచకొండలో గత ఏడాది 25 వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. 25 అపార్ట్‌ మెంట్లను సీజ్‌ చేసి నిందితులను అరెస్ట్‌ చేసి కటకటాలపాలు చేశారు. భువనగిరి జోన్‌ లో సుమారు 350 బాలకార్మికులను విముక్తి చేశారు.
    
కాగా మన దేశం నుంచి ఈ అవార్డు అందుకుంటున్న రెండో వ్యక్తి  మహేశ్‌ భగవత్‌. ఇంతకుముందు 2010లో ఐజీ ఉమాకాంత్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ జిల్లాకు చెందిన మహేశ్‌ భగవత్‌.. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ రాచకొండ కమిషనరేట్‌ కు సీపీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మహేశ్‌ భగవత్‌ కు అంతర్జాతీయ అవార్డులు వరించాయి.  సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే యువతకు మార్గదర్శకత్వం అందించడంలోనూ మహేశ్ భగవత్ ముందుంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News