ఆ వీడియోలను షేర్‌ చేస్తే అంతే ... రాచకొండ సీపీ సీరియస్‌ వార్నింగ్‌ !

Update: 2021-07-16 12:30 GMT
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ సమయంలోనే కొంత మంది గతేడాది హైదారాబాద్ వరదలకు సంబంధించిన వీడియోలను తాజా వర్షాలకు లింక్ చేసి భయపడేలా వీడియోల్ని షేర్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై రాచకొండ సీపీ మహేస్‌ భగవత్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

భారీ వర్షాలకు నగరంలో వరదులు వచ్చాయి, ఇళ్లు కూలిపోతున్నాయి అని పాత వీడియోలను వైరల్ చేస్తోన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొందరు ఉద్దేశపూర్వకంగా గతేడాది వరదల వీడియోలను కొత్తవిగా ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. వర్షాల కారణంగా ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 100కు ఫోన్‌ చేస్తే సంబంధిత సిబ్బంది సహకారం అందిస్తారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు, రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బందికి ప్రజలు సహకరించాలి అని సీపీ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నగరంలో భారీ వర్షాలకు అక్కడక్కడా రహదారులు జలమయమవుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే రోడ్లపై కొద్దిసేపు మాత్రమే వరద నీరు నిలుస్తుంది. ఆ సమయంలో బల్దియా, ట్రాఫిక్‌ పోలీసులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు.

కాసేపటికే నీరంతా వెళ్లిపోతుంది. అందుకే వర్షం పడి తగ్గిన వెంటనే బయటకు వెళ్లకుండా.. కాస్త ఆగి వస్తే… ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉత్పన్నం కావని అధికారులు చెబుతున్నారు. నగర ట్రాఫిక్‌ పోలీసులు 44 ప్రధానమైన నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి.. వాటి వివరాలను జీహెచ్‌ఎంసీకి అందజేశారు. అలాగే సైబరాబాద్‌ పరిధిలోనూ ఇలాంటి వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు 39 చోట్ల ఉన్నట్లు వెల్లడించారు. నాలాలు, డ్రైనేజీలు, వర్షం నీటి లైన్లు మట్టితో కూరుకుపోయి.. చెత్తాచెదారం, ప్లాస్టిక్‌తో నిండి ఉంటాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటూ.. ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీని కోరుతుంటారు.
Tags:    

Similar News