టీమిండియాలో సమూల మార్పులు.. ఆ ముగ్గురికీ ప్రమాదమే

Update: 2022-12-29 01:30 GMT
ఆసియా కప్, టి20 ప్రపంచ కప్, న్యూజిలాండ్ సిరీస్, బంగ్లాదేశ్ టూర్..ఒక్కోటి ముగిశాయి.. అన్నిట్లోనూ చేదు అనుభవాలే. అసలు 2022 సంవత్సరమే టీమిండియాకు చేదు అనుభవం. ఒక్కటంటే ఒక్కటీ చెప్పుకోదగ్గ గెలుపు లేదు. దక్షిణాఫ్రికా సిరీస్ తో మొదలు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్, టి20 ప్రపంచ కప్ వరకు అంతా ఓటములే.

ఇక జట్టుపరంగానూ అన్నీ ఎదురుదెబ్బలే. ఈ ఏడాది ఆరంభంలోనే కెప్టెన్సీకి కోహ్లి గుడ్ బై చెప్పాడు. ఆ సందర్భంగా తలెత్తిన వివాదం అంత తొందరగా మర్చిపోయేది కాదు.టి20లకు పగ్గాలు వదిలేసి టెస్టులు, వన్డేలకు సారథిగా కొనసాగుతానన్న కోహ్లి ప్రతిపాదనను బీసీసీఐ అసలు లెక్కలోకే తీసుకోలేదు. దీంతో తదనంతర కోహ్లి మొత్తం కెప్టెన్సీనే వదిలేశాడు. రోహిత్ శర్మకు సారథ్యం అప్పగిస్తే మొదట్లో మెరుగ్గా కనిపించినా.. ఏడాది చివరకు వచ్చేసరికి ఏమీ ప్రగతి కనిపించని పరిస్థితి.

వారు వన్డేలకూ కష్టమేనా?మరో పదినెలల్లో భారత్ లోనే వన్డే ప్రపంచ కప్ జరుగనుంది. దీనికిముందు మన జట్టు ఆడే ప్రతి సిరీస్ కీలకమైనదే. కాగా, ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని వచ్చిన జట్టులోని సభ్యులైన పలువురికి ప్రపంచ కప్ జట్టులో చోటు ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్థితి. శ్రీలంకతో సొంతగడ్డపై జనవరి 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడబోతోంది టీమిడియా. ఈ సిరీస్‌ల కోసం జట్లను ప్రకటించారు. వన్డే జట్టు అంచనాలకు తగ్గట్లే ఉంది. టి20 జట్టులో మాత్రం కీలక మార్పులు జరిగాయి.

ఒక రకంగా చెప్పాలంటే జట్టు ముఖచిత్రమే మారిపోయింది. ఒక విధంగా చూస్తే రోహిత్, కోహ్లిలతో పాటు వన్డేల్లో కేఎల్ రాహుల్ స్థానమూ మున్ముందు కష్టమే. టి20లకు అతడే సారథి టి20లు అంటే కుర్రాళ్ల ఆట అనే పేరుంది.  దీనికితగ్గట్లే ఆ ఫార్మాట్ లో మరింత వేగం పెరిగింది. 36 ఏళ్ల రోహిత్ విధ్వంసక ఆటగాడే అయినా.. టి20ల్లో అతడి జోరు తగ్గింది.

వన్డేల్లోనైతే ఫర్వాలేదనకున్నా పొట్టి ఫార్మాట్ లో రోహిత్, ఆ మాటకొస్తే కోహ్లి ఇద్దరికీ చోటు కష్టమే.రాహుల్ ఎలాగూ ఏ ఫార్మాట్ లోనూ నిలకడగా లేడు కాబట్టి.. అతడిని పరి గణించాల్సిన పనిలేదు. ఇక లంకతో సిరీస్ కు ప్రకటించిన టి20 జట్టులో రోహిత్ ను మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా ప్రకటించారు. ఇదేమీ తాత్కాలికంలా కాకుండా.. పూర్తి స్థాయిలో హార్దిక్‌కు పగ్గాలిచ్చినట్లుంది.

రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌లోనే కాక దాని కంటే ముందు ఆసియా కప్‌లోనూ పేలవ ప్రదర్శన చేసింది భారత్. దీంతో అతడిపై వేటు వేయాలన్న డిమాండ్లు వినిపించాయి. మరోవైపు నిలకడగా ఆడలేకపోతున్న కోహ్లి, వరుస వైఫల్యాలు చవిచూస్తున్న రాహుల్‌లు కూడా జట్టుకు భారంగా మారుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేయాలని సెలక్టర్లు ఫిక్సయినట్లున్నారు. అప్పట్లో  ఆ దిగ్గజాలు ఏం చేశారో?2007 వన్డే ప్రపంచ కప్ లో దారుణ ప్రదర్శనతో తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన టీమిండియా.. అదే ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో గెలిచింది. అయితే, నాటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, దిగ్గజాలు సచిన్, గంగూలీ తీసుకున్న నిర్ణయం ఇక్కడ ప్రస్తావనార్హం.

టి20 ప్రపంచకప్‌కు ముందు తొలుత సచిన్ తనను ఈ ఫార్మాట్ కు పరిగణించవద్దని కోరాడు. దాంతో రాహుల్ ద్రవిడ్, గంగూలీ ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు, రోహిత్, కోహ్లి, రాహుల్‌ల పరిస్థితి ఇలాగే మారేలా ఉంది. ఇక వాళ్లను మళ్లీ టీ20ల్లో చూడడం అనుమానమే కావచ్చు. ఈ నేపథ్యంలో వన్డే ల్లోనూ వారు రాణించేదాన్ని బట్టి స్థానం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్.

ఎలాగూ రోహిత్,కోహ్లి వచ్చే ఏడాది తర్వాత టి20లు, ఎంపిక చేసుకున్న వన్డే సిరీస్ లకు పరిమితం అవుతారు. టెస్టుల్లో కొనసాగుతారు. 36 ఏళ్ల రోహిత్, 34 ఏళ్ల కోహ్లి కంటే 31 ఏళ్ల రాహుల్ కు కొంత కాలం ఆడే అవకాశం ఉంది. అయితే అతడి నిలకడగా ఆడితేనే. ఇప్పటికైతే రాహుల్ కు పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News