మోడీ నిర్ణయంతో పెద్దగా ప్రయోజనం ఉండదా?

Update: 2016-11-11 03:45 GMT
పాత పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన అనంతరం ఈ విషయంపై అత్యధికశాతం మంది ఇక నల్లకుబేరులకు చెక్ పెట్టినట్లేనని, అవినీతి సొమ్ము అంతా బయటకు వస్తుందని రకరాకాలుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోడీ నిర్ణయంతో ఇకపై భారతదేశంలో నల్లధనం కనిపించదని చెప్పిన వారూ ఉన్నారు! ఈ క్రమంలో ప్రధాని నల్లధనంపై చేస్తున్న పోరాటం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఏమో గానీ, నల్ల కుబేరులు మాత్రం మహా ముదుర్లని గతంలోనే స్పష్టం చేశారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.

అంతా అనుకుంటున్నట్లు భారీ మార్పులేమీ ఉండవనే విషయాన్ని తనదైన విశ్లేషణతో చెప్పిన రఘురామ్ రాజన్... నోట్ల రద్దుతో పెద్దగా ప్రయోజనం ఉండదని 2014 ఆగస్ట్‌ లో జరిగిన మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. నేటి ఆధునిక యుగంలో నల్ల కుబేరులు చాలా తెలివైనవారని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగా నల్లధనం అంటే ఎవరికీ తెలియకుండా నోట్ల కట్టలను దాచుకోవడం, గోనే సంచుల్లోకుక్కి అండర్ గ్రౌండ్ లో నిల్వ ఉంచడం వంటివి నేటి కాలంలో చాలా తక్కువని.. చాలామంది తమవద్ద ఉన్న నల్లధనాన్ని చిన్న చిన్నగా విభజించి పలు రూపాల్లోకి ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఎక్కువమంది నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో మరికొందరైతే... బంగారం తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుండగా.. ఇంకొందరు మ్యూచివల్ ఫండ్స్ - స్టాక్ మార్కెట్ - ఇన్స్యూరెన్స్ రంగాల్లోకి నిధులను భారీగా మళ్లించినట్లు పేర్కొన్నారు.

రాజన్ చెప్పిన వివరాల ప్రకారం... చిన్న చిన్న రూపాల్లోకి మారిపోయిన బ్లాక్ మనీ లెక్కల్లో కనిపించినప్పటికీ బంగారం రూపంలోకి మారి ఆభరణాలుగా బీరువాల్లో మూలుగుతోన్న విషయాన్ని గుర్తించడం, వెలికితీయడం చాలా కష్టం. ఇదే విషయంపై రాజన్ తన అభిప్రాయాన్ని గతంలోనే తెలిపారు! నల్లధనాన్ని రూపుమాపాలంటే ఈ విషయంలో చేయాల్సిన పని నోట్ల రద్దు కంటే... ఆదాయ పన్నులు రాబట్టే విధానంపై దృష్టి పెట్టడమే అని ఆయన సూచించారు. స్థోమత ఉండి కూడా ఆదాయ పన్ను కట్టని వారిని ఏమాత్రం ఊపేక్షించకూడదని, అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తే నల్లధనాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 2014 సమయంలోనే అభిప్రాయపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News