'చంపేంత వరకు వెళ్లేలా వ్యక్తుల్ని రెచ్చగొట్టేలా రఘురామ ప్రయత్నం'

Update: 2021-05-20 06:41 GMT
ఎంపీపైన రాజద్రోహం కేసు మోపుతారా? పుట్టిన రోజున పదుల సంఖ్యలో సీఐడీ అధికారులు హైదరాబాద్ కు వెళ్లి మరీ అరెస్టు చేస్తారా? కస్టడీలో ఉన్న ఆయనపై గుర్తు తెలియని అధికారులు దాడి చేశారు? ఎవరూ ఫిర్యాదు చేయకుండానే కేసు నమోదు చేస్తారా? ఇదంతా కావాలని చేసిన కుట్ర.. పగ తీర్చుకోవటానికే ఈ ప్రయత్నమంతా.. ఇలా రఘురామ అరెస్టుపై ఎదురవుతున్న ప్రశ్నలు. అందుకు ప్రతిగా.. ప్రభుత్వం పైనా.. ప్రభుత్వాధినేత మీదా దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా? వర్గ రాజకీయాలు చేస్తారా? ప్రజల్ని తన మాటలతో రెచ్చగొడతారా? కౌంటర్ ప్రశ్నల్ని సంధిస్తున్నారు.

ఇలా పోటాపోటీ వాదనలు ఏపీతో పాటు తెలంగాణలోనూ రఘురామ ఎపిసోడ్ మీద హాట్ చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ కేసులో ఏపీ సర్కారు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో రఘురామ చేసిన దారుణమైన నేరాల పరంపరను ఏకరువు పెట్టింది. ఆయనపై ఫిర్యాదు రాకుండానే కేసు ఎందుకు నమోదు చేసిందో చెప్పే ప్రయత్నం చేసింది. కస్టడీలో ఉన్న ఆయనపై దాడి ఆరోపణలకు సమాధానం ఇచ్చింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం తన వాదనను పూర్తిస్థాయిలో వినిపించింది.

ఏపీ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి చూస్తే..

-  వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచేందుకు ప్రభుత్వం పట్ల అసంత్రప్తిని పెంచటానికి ఎంపీ రఘురామ నిరంతరం ప్రయత్నం చేశారు. ఆయన ప్రకనల్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే రాజద్రోహం నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.

- పార్లమెంటు సభ్యుడితో పాటు ప్రతి వ్యక్తికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్వతంత్ర హక్కు ఉంటుంది. ఆ హక్కును శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉపయోగించటానికి వీల్లేదు. భావప్రకటన స్వేచ్ఛలోనే శాంతిభద్రతలకు భంగంకలిగించరాదన్న విషయం అంతర్గతంగా ఉంటుంది.

-  ఒకట్రెండుసార్లు పొరపాటుగా ప్రకటనలు చేయలేదు. ఉద్దేశపూర్వకంగా పలువురు వ్యక్తులతో కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాష్ట్రంలో కులాలు.. మతాల ఆధారంగా చిచ్చుపెట్టి అశాంతిని పెంచే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పట్ల అసంత్రప్తిని రాజేసేలా వివిధ తరగతులు.. సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

-  రఘురామ వ్యాఖ్యలు.. ప్రకటనలు ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాతే చర్చకు పూనుకున్నాం. జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా పత్రికా సమావేశాలు నిర్వహించకుండా వెనక్కు తగ్గలేదు. తన పాదాలపై పోలీసులు కొట్టినట్లుగా చూపించి.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా చేశారు.

-  కస్టడీలో ఎంపీని చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణ పూర్తిగా అవాస్తవం. అదే నిజమై ఉంటే ప్రభుత్వం పిటిషనర్ ను వైద్య పరీక్షకు పంపటానికి అనుమతి ఇచ్చి ఉండేదే కాదు. తన అరెస్టుకు వ్యతిరేకంగా ఒక భ్రాంతిని క్రియేట్ చేయటానికి ఆయనలా చేశారు. ఎవరో వచ్చి కంప్లైంట్ చేసే వరకు ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఎదురుచూడాలని చెప్పే హక్కు పిటిషనర్ కు లేదు.

-  పోలీసు శాఖ పూర్తి నిష్పాక్షికంగా పని చేస్తోంది. తనపై రాజకీయ కారణాలతోనే చర్యలు తీసుకుంటున్నారన్న పిటిషనర్ ఆరోపణల్లో నిజం లేదు. ఎంపీ ప్రకటనలు విధ్వంసకర ప్రభావం చూపుతున్నాయని గుర్తించిన తర్వాతే పోలీసు శాఖ ఆయనపై చర్యల్ని షురూ చేసింది. ఎంపీ ప్రవర్తనతో పాటు సహ కుట్రదారుల పాత్రనూ విచారించాల్సి ఉంది. అందువల్ల రఘురామను పోలీసు కస్టడీకి ఇవ్వాలి.

- సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిన తర్వాత అంబులెన్సులో వెళ్లనని.. తన సొంత వాహనంలోనే వెళతానని పట్టుపట్టారు. కోర్టు నిర్దేశించిన గడువు నేపథ్యంలో పోలీసు అధికారులు వారి డిమాండ్ అంగీకరించక తప్పలేదు. వాహనంలో బయలుదేరిన తర్వాత తన పాదాల్ని మీడియాకు చూపుతూ మొత్తం ప్రక్రియను హాస్యస్పదంగా మార్చారు. ఆ వీడియోలు యూట్యూబ్ లో చూడొచ్చు.
Tags:    

Similar News