ఎంపినే సీఐడీకి అవకాశం ఇస్తున్నారా ?

Update: 2021-06-02 01:30 GMT
ఒకవైపు రాష్ట్రప్రభుత్వం మరోవైపు తిరుగుబాటు ఎంపి మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా సీఐడీపై ఎంపి ఢిల్లీలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఛైర్మన్ పీసీ పంత్ ను కలిసి ఫిర్యాదుచేశారు. కస్టడీలో ఉన్నపుడు తనపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. తనపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలంటు విజ్ఞప్తిచేశారు.

ఆదివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసిన ఎంపి ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీరెడ్డిపైన కుట్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్మీ ఆసుపత్రి నుండి డిస్చార్జయిన ఎంపి నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెండుపాదాల్లోని సెల్స్ బాగా డ్యామేజి అయ్యాయని చెప్పి రెండు కాళ్ళకు+పాదాలకు కలిపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) కట్టుకట్టారు. రెండు వారాలపాటు పూర్తిరెస్టు అవసరమని కూడా సూచించారు.

సీన్ కట్ చేస్తే ఎయిమ్స్ డాక్టర్లు రెండు వారాల పూర్తి రెస్టు అవసరమని చెప్పినా ఎంపి మాత్రం ఎంచక్కా సీఐడీ అధికారులపై ఫిర్యాదులు చేయటం కోసం అటు ఇటు తిరుగుతునే ఉన్నారు. ఇక్కడే అందరికీ ఎంపి వ్యవహారశైలిపై అనుమానం వస్తోంది. రెండు పాదాల్లోని సెల్స్ పూర్తిగా డ్యామేజవ్వటం నిజమే అయితే ఎంపి ఎలా తిరగ్గలుగుతున్నారు. సహాయకులను దగ్గర పెట్టుకుని వీల్ ఛైర్లో తిరుగుతున్నా కేంద్రమంత్రి, హ్యూమన్ రైట్స్ కమీషన్ ఛైర్మన్ కార్యాలయాల్లో అయినా నడవాల్సిందే కదా.

సీఐడీ విచారణను తప్పించుకునేందుకే ఎంపి ఢిల్లీకి వెళ్ళి ఎయిమ్స్ లో చేరారనే ఆరోపణలున్నాయి. అయితే 24 గంటల ముందు సీఐడీ నోటీసిలిస్తే విచారణకు హాజరవ్వాల్సిందే అని సుప్రింకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాబట్టి ఫిర్యాదుల కోసం చక్కగా తిరుగుతున్న ఎంపిని సీఐడీ విచారణకు పిలిపించే అవకాశాలు కనబడుతున్నాయి.

ఇక సీఐడీ అరెస్టు చేసిన కేసు గురించి మీడియాతో కానీ సోషల్ మీడియాతో కానీ మాట్లాడవద్దని సుప్రింకోర్టు స్పష్టంగా ఎంపిని ఆదేశించింది. అయితే సుప్రిం ఆదేశాలను కూడా ఎంపి ఉల్లంఘిస్తున్నారు. అంటే సుప్రింకోర్టు చెప్పినట్లుగా నేరుగా మీడియా, సోషల్ మీడియాతో మాట్లాడకపోయినా తాను చెప్పదలచుకున్నది పరోక్షంగా లీకుల రూపంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియాకు చేరవేస్తున్నారు.

రక్షణమంత్రి, హ్యూమన్ రైట్స్ కమీషన్ ఛైర్మన్ను కలిసి ఎంపి చేసిన ఫిర్యాదుల వివరాలు పూసగుచ్చినట్లు మీడియాలో ఎలా వచ్చింది ? ఎంపినే ఫిర్యాదుల వివరాలను సదరు మీడియాకు అందిస్తున్న విషయం స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని సీఐడీ సుప్రింకోర్టులో చెప్పి బెయిల్ రద్దు చేయించేందుకు ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంటే ఎంపినే తనంతట తానుగా సీఐడీకి అవకాశం కల్పిస్తున్నట్లయ్యింది.
Tags:    

Similar News