బాబుపై ర‌ఘువీరా సెటైర్ పేలిందే!

Update: 2017-04-03 08:10 GMT
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు నిజంగానే కౌంట్ డౌన్ మొద‌లైయ్యిందా? అంటే... అవున‌నే అంటున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి. అయినా నిన్న‌టిదాకా చంద్రబాబుపై ఇలాంటి త‌ర‌హా కామెంట్లు చేయ‌ని ర‌ఘువీరా... అక‌స్మాత్తుగా ఈ కామెంట్ ఎందుకు చేశార‌నేగా మీ డౌటు? అక్క‌డికే వ‌స్తున్నాం. నిన్న వెల‌గ‌పూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌నం వ‌ద్ద ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వేదిక మీద చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ను పున‌ర్వ‌వ‌స్థీక‌రించారు. ఈ క్ర‌మంలో ఐదుగురు మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లికిన బాబు... కొత్త‌గా 11 మందిని త‌న కేబినెట్‌ లో చేర్చుకున్నారు. ఫ‌లితంగా త‌న కేబినెట్‌ లో మొత్తం మంత్రుల సంఖ్య‌ను ఆయ‌న 26కు చేర్చుకున్నారు.

ఇక కుమారుడు నారా లోకేశ్‌ను కూడా చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ లోకి చేర్చుకున్నారు. అస‌లు లోకేశ్‌ కు మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకే చంద్ర‌బాబు కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ చేప‌ట్టారని సాక్షాత్తు సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యుడు బీవీ రాఘ‌వులు తేల్చేశారు. ఇక చంద్ర‌బాబు కేబినెట్‌ లో కొత్త‌గా చోటు ద‌క్కించుకున్న 11 మందిలో న‌లుగురు విప‌క్ష వైసీపీ టికెట్‌ పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారున్నారు. ఈ విష‌యాన్ని ఆధారం చేసుకుని నిన్న ర‌ఘువీరా... ఓ ఘాటు ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింద‌ని చెబుతూ విడుద‌ల చేసిన ఆ ప్ర‌క‌ట‌న‌లో ర‌ఘువీరా... చంద్రబాబు ప‌త‌నానికి దారి తీసిన కార‌ణాల‌ను కూడా సోదాహ‌ర‌ణంగా ఉద‌హ‌రించారు. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీని న‌మ్ముకుని పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్న టీడీపీ సీనియ‌ర్ల‌ను వ‌దిలేసి... నిన్న గాక మొన్న పార్టీలోకి వ‌చ్చి చేరిన వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు ఎలా ఇస్తార‌ని ర‌ఘువీరా ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు అనాలోచిత నిర్ణ‌యాల‌తో టీడీపీలో అగ్గి రాజుకుంద‌ని, ఇది చంద్ర‌బాబు ప‌త‌నానికి నాందీ అని కూడా ర‌ఘువీరా చెప్పారు. అంతేకాకుండా... విప‌క్షం వైసీపీ టికెట్ల‌పై గెలిచి ఆ త‌ర్వాత పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేల ప‌ద‌వుల‌ను ర‌ద్దు చేయడంతో పాటు ఆ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిపించాల్సిన బాధ్య‌త ఉన్న చంద్ర‌బాబు... దానిని మ‌ర‌చి ఫిరాయింపుదారుల‌తో కుమ్మ‌క్కై... వారిని కాపాడుకునేందుకే త‌న మంత్రివ‌ర్గంలో చోటు ఇచ్చార‌ని ఆరోపించారు. నాడు కేసీఆర్ ఇదే ప‌ని చేస్తే గగ్గోలు పెట్టిన చంద్ర‌బాబు... ఇప్పుడు అదే ప‌నిని ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు చ‌ర్య ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేన‌ని కూడా ర‌ఘువీరా చెప్పారు. ఈ వ్య‌వ‌హారాన్నంత‌టినీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు బుద్ధి చెప్పేలా ప్ర‌జ‌లు తీర్పు చెబుతార‌ని ర‌ఘువీరా జోస్యం చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News