మోడీపై రాహుల్ నిశిత విమ‌ర్శ‌లు.. గాంధీ సిద్ధాంతాల‌పై చుర‌క‌లు

Update: 2022-10-02 17:51 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ నిశిత విమ‌ర్శ‌లు గుప్పించారు. గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. ఆయ‌న చెప్పిన సిద్ధాంతాల‌ను మీరు చెప్ప‌డం కాదు.. వాటిని పాటించండి.. అని చుర‌క‌లు అంటించారు. గాంధీ సిద్ధాంతాలను వల్లించడం కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం కష్టమని విమర్శించారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళులు అర్పించిన ఆయన.. జాతిపితను చంపిన సిద్ధాంతమే గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.

భారత్‌ జోడో యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్న రాహుల్‌.. 1927లో కర్ణాటకలో గాంధీ సందర్శించిన ఖాదీ గ్రామోదయ కేంద్రంలో నివాళులు అర్పించారు. "దేశం కన్న‌ గొప్ప వ్యక్తిని గుర్తుచేసుకుంటూ నేడు నివాళి అర్పిస్తున్నాం. అహింస, ఐకమత్యం, సమానత్వం, న్యాయం అని గాంధీ చెప్పిన మార్గంలో నడుస్తూ.. భారత్‌ జోడో యాత్రను కొనసాగిస్తున్నాం. బ్రిటిష్‌ రాజ్‌కు వ్యతిరేకంగా గాంధీ పోరాడినట్లుగానే.. మహాత్ముడిని చంపిన సిద్ధాంతంపై మేము కూడా యుద్ధాన్ని ప్రకటించాం. అదే సిద్ధాంతం గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తుండడంతోపాటు కష్టపడి సంపాదించుకున్న మన స్వేచ్ఛను హరిస్తోంది. హింసా రాజకీయాలు, అసత్య ప్రచారాలు కొనసాగుతున్న వేళ.. వాటికి వ్యతిరేకంగా గాంధీజీ చెప్పిన సందేశాన్ని భారత్‌ జోడో యాత్రలో ప్రచారం చేస్తాం" అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

కాగా, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 624 కి.మీ పూర్తిచేసుకున్న ఈ యాత్ర.. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరులో కొనసాగుతోంది. కన్యాకుమారిలో సెప్టెంబర్‌ 7న మొదలైన భారత్‌ జోడో యాత్ర కశ్మీర్‌ వరకు కొనసాగనుంది. కాగా, భారత్‌ జోడో యాత్రలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొననున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో సాగుతున్న ఈ యాత్రలో ఈ నెల 6న సోనియాగాంధీ పాల్గొంటారని పార్టీవర్గాలు తెలిపాయి. పార్టీశ్రేణులతో కలిసి సోనియా పాదయాత్ర చేస్తారని పేర్కొన్నాయి. భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అధినేత్రి పాల్గొనటం ఇదే మొదటిసారి కానుంది. భారత్‌ జోడోయాత్ర మొదలైనప్పుడు చికిత్స కోసం సోనియా విదేశాల్లో ఉన్నారు.
Tags:    

Similar News