రాహుల్ గాంధీని పీఎం కాకుండా చేసింది సోనియా గాంధీనా?

Update: 2020-06-23 09:10 GMT
వారసులను ఎప్పుడు దించాలి.. ఎలా దించాలనే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు మంచి క్లారిటీ ఉంది. అందుకే ఉద్యమ సమయంలోనే తన వారసుడైన కేటీఆర్ ను 2009లో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా బరిలో దించాడు. అలా మొదలైన ప్రయాణం ఇప్పుడు తెలంగాణ సర్కారులో కేటీఆర్ ను నంబర్ 2గా నిలబెట్టింది. ఇప్పుడు కేసీఆర్ లేకున్నా.. ఆయన నాయకత్వాన్ని అంతే పటిష్టంగా చేయగల సామర్థ్యం కేటీఆర్ కు వచ్చేసింది. ఇదంతా 11 ఏళ్లులో సాగింది.

కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాత్రం మంది మాట విని తన కొడుకు రాహుల్ గాంధీని అక్కరకు రాకుండా చేసిందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. చెట్టంత కొడుకు చేతికి వచ్చినా అతడిని పీఎం చేయలేక దాచిపెట్టి ఇప్పుడు ఎటూ కాకుండా చేసిందనే అపవాదును మూటగట్టుకుంది. జీవితంలో జరగాల్సిన సమయంలో జరగకపోతే ఎలా అవుతుందో రాహుల్ గాంధీని చూస్తే అర్థమవుతుందంటారు. అటూ రాహుల్ గాంధీకి పెళ్లి చేయలేదు.. ఇటు ప్రధానిని చేయకుండా తన బాధ్యతల్లో సోనియాగాంధీ తప్పు చేశారని అంటున్నారు.

అది 2009.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో రెండోసారి సీఎంగా గెలిచిన సమయం.. ఏకంగా ఫుల్ మెజార్టీ సాధించి 38 ఎంపీ సీట్లను ఏపీ నుంచి గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సోనియమ్మను కోరాడట.. కానీ సోనియా పట్టించుకోలేదు. ప్రధానిగా సీనియర్ అయిన మన్మోహన్ సింగ్ నే చేసేసింది. అప్పటికే ఒక దఫా పీఎం అయిన మన్మోహన్ స్థానంలో రాహుల్ గాంధీని చేసి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ఈ దుస్థితి పట్టేది కాదనే వాదన ఉంది.
 
2009లో రెండోసారి యూపీఏ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని అందరూ డిమాండ్ చేశారు. ఇంట్లో వాళ్లు కూడా సోనియాపై ఒత్తిడి తెచ్చారు. కానీ సోనియాగాంధీ నాటి వృద్ధ కాంగ్రెస్ జంబూకాల మాటలు విని తన నిర్ణయం మార్చుకుందట.. రాహుల్ గాంధీ స్థానంలో మన్మోహన్ నే రెండోసారి ప్రధానిని చేసింది.  

అయితే వృద్ధ జంబూకాలు సోనియాను ఏమార్చి మాయచేశారనే అపవాదు ఉంది. మన్మోహన్ సింగ్ అయితే వాళ్ల మాట వింటారని.. యువకుడైన రాహుల్ గాంధీ అయితే మాట వినడని కాంగ్రెస్ సీనియర్లు తమ స్వార్థం చూసుకొని రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీకి మంచి సలహాలు ఇవ్వకుండా చేశారనే టాక్ ఏఐసీసీ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అప్పుడే ప్రధానిగా రాహుల్ ను చేసి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కు, రాహుల్ కు ఈ దుస్థితి వచ్చేది కాదని ఢిల్లీ వర్గాలు అనుకుంటున్నాయి. 
Tags:    

Similar News