మోదీజీ... రాహుల్‌ ను కాసుకోవాల్సిందే!

Update: 2017-11-15 07:55 GMT
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడిగానే కాకుండా... ఆ పార్టీకి యువ‌రాజుగా వెలిగిపోతున్న రాహుల్ గాంధీ... మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. అప్ప‌టికే ప‌దేళ్ల పాటు ప్ర‌ధానిగా ప‌నిచేస్తున్న మ‌న్మోహ‌న్ సింగ్‌ను కాద‌ని, కాంగ్రెస్ అధిష్ఠానం 2014లో రాహుల్ గాంధీని భావి ప్ర‌ధానిగా బరిలోకి దింపింది. అయితే అనుభ‌వ రాహిత్యంతో పాటు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా మాట్లాడ‌టంలో ఏమాత్రం స‌త్తా చాట‌లేక‌పోయిన రాహుల్ గాంధీ కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాభ‌వాన్నే మూట‌గ‌ట్టుకుంద‌ని చెప్పాలి. రాహుల్ కార‌ణంగా పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రిగినా కూడా మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌నే ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపే ప‌నిని మాత్రం పార్టీ అధిష్ఠానం వ‌దులుకోలేద‌నే చెప్పాలి. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కాంగ్రెస్ పార్టీలో ఈ త‌ర‌హా వ్యూహాలు కొత్తేమీ కాకున్నా... ఓ సారి పార్టీని దాదాపుగా అథోఃపాతాళానికి నెట్టేసిన నేత‌ను మ‌ళ్లీ ఆ పార్టీ భుజానికెత్తుకోవ‌డం చూస్తుంటే... నిజంగానే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.

కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణ‌యం మ‌ళ్లీ బీజేపీకి అనుకూలిస్తుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కేనా? అంటే అవున‌నే స‌మాధానం చెప్ప‌డం కాస్తంత క‌ష్ట‌మే. ఎందుకంటే రాహుల్ గాంధీలో ఇటీవ‌లి కాలంలో క‌నిపిపిస్తున్న మార్పు చూస్తుంటే.. బీజేపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఎదురు కానుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత రాహుల్‌లో అంత‌గా ప‌రిణతి ఏం క‌నిపించింద‌ని ఈ విశ్లేష‌కుల‌ను అడిగితే... కాస్తంత ఆస‌క్తిక‌ర స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఆ ఆన్స‌ర్ల‌లోని అస‌లు విష‌యాల్లోకి వెళ్లిపోతే... గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాహుల్‌లో పెద్ద‌గా మార్పు వ‌చ్చిన‌ట్లుగా క‌నిపించిన దాఖ‌లా లేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఆ త‌ర్వాత ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ రాహుల్ నేతృత్వంలో బ‌రిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా అన్నీ ఎదురు దెబ్బ‌లే త‌గిలాయి. ఈ ఎదురు దెబ్బ‌ల‌ను రాహుల్ కూడా పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు.

అయితే మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభం కావ‌డానికి కాస్తంత ముందుగానే రాహుల్ బ‌రిలోకి దిగిపోయారు. గుజ‌రాత్‌లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ను సుదీర్ఘంగా కొన‌సాగించేందుకు ఆయ‌న ప‌క్కా రోడ్ మ్యాప్ రూపొందించుకున్నారు. అంతేకాదండోయ్‌... అప్ప‌టిదాకా క‌నిపించిన త‌న ఆహార్యాన్ని కూడా మార్చేశార‌నే చెప్పాలి. బ‌హిరంగ స‌భ‌ల్లో రాహుల్ మాట్లాడుతున్న తీరులోనూ పెద్ద మార్పే వ‌చ్చింది. అధికార ప‌క్షంపై విరుచుకుప‌డే తీరులోనూ రాహుల్‌లో స్ప‌ష్టమైన మార్పు వ‌చ్చింద‌ట‌. ఇటీవ‌లి కొన్ని సంద‌ర్భాల‌ను ప్ర‌స్తావిస్తున్న విశ్లేష‌కులు... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి రాహుల్ రాటుదేలిపోవ‌డం ఖాయ‌మేన‌ని చెబుతున్నారు. ఆ సంద‌ర్భాల విష‌యానికొస్తే.. ప్ర‌ధానిపై ఒంటికాలిపై లేచే వైఖ‌రిని కొన‌సాగిస్తున్న రాహుల్‌... ఆ సంద‌ర్భంగా చేస్తున్న వ్యాఖ్య‌ల్లో మాత్రం పూర్తి స్థాయి ప‌రిణ‌తిని క‌న‌బ‌రుస్తున్నారు. ప్ర‌ధానిని తాము గౌర‌వించ‌బోమ‌న్న‌ట్లుగా ఇదివ‌ర‌కు రాహుల్ వ్య‌వ‌హ‌రించేవారు.

అయితే మొన్నామ‌ధ్య ప్ర‌ధానిని తాము గౌర‌విస్తామ‌ని, అయితే విమ‌ర్శ‌లు చేయ‌డంలో మాత్రం వెనుకాడ‌బోమంటూ ఓ స‌రికొత్త పంథాను ఎంచుకున్న ఆయ‌న గుజ‌రాత్‌లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. అంతేకాకుండా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో మోదీ ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాను ఎంత‌గా వాడుకున్నారో తెలిసిందే. అయితే ఈ విష‌యాన్ని కాస్తంత ఆల‌స్యంగా గ్ర‌హించిన రాహుల్ గాంధీ ఇప్పుడు త‌న సోష‌ల్ మీడియా టీంను మ‌రింత‌గా ప‌టిష్టం చేసుకున్న‌ట్లుగా ఆయ‌నే చెప్పేశారు. తాను సోష‌ల్ మీడియాలో స్పందించే ప్ర‌తి విష‌యాన్ని త‌న‌తో పాటు తాను ఏర్పాటు చేసుకున్న టీం ప‌రిశీలించిన త‌ర్వాతే పోస్ట్ అవుతుంద‌ని, అయినా మోదీలా ప్ర‌తి దానిపైనా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టబోన‌ని కూడా రాహుల్ తెగేసి మ‌రీ చెప్పేశారు. నాడు మోదీ సోష‌ల్ మీడియా ప్ర‌చారం కోసం పెయిడ్ వ‌ర్క‌ర్స్‌ను పెట్టుకున్నార‌ని, తాను మాత్రం పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌తోనే ప‌నిచేయించుకున్న‌ట్లు రాహుల్ చెప్పుకొచ్చారు. మొత్తానికి రాహుల్‌లో ప్రస్తుతం క‌నిపిస్తున్న మార్పు చూస్తే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీ విజ‌యం అంత ఈజీ కాద‌న్న విష‌యంలో మాత్రం ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి.
Tags:    

Similar News