ఫ్యామిలీ ప్యాకేజ్‌: అంతా శివ భ‌క్తులేన‌ట‌

Update: 2017-12-01 16:48 GMT
ఎన్నిక‌లా మ‌జాకానా?  మామూలుగా రాని విష‌యాలు ఎన్నిక‌ల పుణ్య‌మా అని వ‌చ్చేస్తున్నాయి. ఏమైందో ఏమో కానీ.. ఈ మ‌ధ్య కాలంలో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు క‌మ్ కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ కొత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో త‌న‌కు సంబంధించిన విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ని ఆయ‌న‌.. ఈ మ‌ధ్య టైం చూసుకొని మ‌రీ కొత్త కొత్త విష‌యాల్ని బ‌య‌ట‌పెడుతున్నారు.

గుట్టు చ‌ప్పుడు కాకుండా ఫారిన్ టూర్ల‌కు వెళ్లే అల‌వాటున్న రాహుల్.. ఈ మ‌ధ్య‌న త‌న విదేశీ ప‌ర్య‌ట‌న విష‌యం చెప్పి వెళ్లారు. అంతేకాదు ఏ దేశం వెళ్లేది కూడా వెల్ల‌డించారు. అంతేనా.. త‌న‌కు మార్ష‌ల్ ఆర్ట్స్ లో ఉన్న ప్ర‌వేశం గురించి సోష‌ల్ మీడియాలో వ‌చ్చేలా చేసి.. త‌న ఇమేజ్ ను స‌రికొత్త త‌ళుకులు అద్దేలా చేశారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల వేళ‌.. త‌న‌లోని శివ‌భ‌క్తుడ్ని బ‌య‌ట‌కు తీశారు. తాను వీర శివ‌భ‌క్తుడిన‌న్న విష‌యాన్ని వెల్ల‌డించి అంద‌రి మాట‌ల్లో హాట్ టాపిక్ గా మారారు. మాట‌కైతే శివ‌భ‌క్తుడిన‌ని చెప్పిన రాహుల్ చేత‌ల్లోకి వ‌చ్చేస‌రికి త‌న చుట్టూ ఉన్న వారికి స‌రిగా అప్ డేట్ చేయ‌ని కార‌ణ‌మో ఏమో కానీ.. సోమేశ్వ‌రాల‌యానికి వెళ్లిన‌ప్పుడు నాన్ హిందూ సంత‌కం పెట్టే పుస్త‌కంలో పెట్టేశారు.

దొరికిందే సందుగా బీజేపీ వాళ్లు రాహుల్ సంత‌కం ముచ్చ‌ట‌ను సోష‌ల్ మీడియాలో పెట్టేసి ర‌చ్చ ర‌చ్చ చేశారు. శివ‌భ‌క్తుడ‌ని చెప్పి మ‌రీ.. నాన్ హిందూ పుస్త‌కంలో పేరు రాయించ‌టం ఏమిటంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాసినోళ్ల త‌ప్పును ప్ర‌స్తావించ‌ని కాంగ్రెసోళ్లు.. త‌మ నేత ప‌రువు తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ క‌మ‌ల‌నాథుల మీద క‌స్సుమ‌న్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే..రాహుల్ ప‌ర‌మ వీర శివ‌భ‌క్తుడే కాదు.. జంధ్యం ఉన్న‌బ్రాహ్మ‌ణుడు కూడా అంటూ కాంగ్రెస్ వృద్ధ సింహం ఒక‌టి గ‌ర్జించి మ‌రీ చెప్పింది. దీని మీద చ‌ర్చ జ‌రుగుతున్న‌వేళ‌.. సోమ‌నాథ్ టెంపుల్ ఎపిసోడ్‌ను ఒక కొలిక్కి తెచ్చేందుకు రాహుల్ డిసైడ్ అయిన‌ట్లున్నారు.

తాజాగా పెద‌వి విప్పిన ఆయ‌న‌.. తాను మాత్ర‌మే కాదు.. త‌మ ఫ్యామిలీ మొత్తం శివ‌భ‌క్తుల‌మ‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. మ‌తాచారాల‌పై రాజకీయాలు చేయొద్ద‌న్న ఆయ‌న‌.. త‌మ నాన‌మ్మ.. దివంగ‌త ప్ర‌ధాని ఇందిరతో స‌హా త‌మ ఫ్యామిలీ మొత్తం శివ భ‌క్తుల‌మ‌న్న కొత్త విష‌యాన్ని ప్ర‌క‌టించారు. అయితే.. త‌మ మ‌త విశ్వాసాల గురించి బ‌య‌ట మాట్లాడ‌మ‌ని చెప్పారు. ఏమైనా బీజేపీ వాళ్ల‌కు థ్యాంక్స్ చెప్పాలి. ద‌శాబ్దాల‌కు ద‌శాబ్దాలు రాజ‌కీయాల్లో ఉన్నా మ‌తం గురించి.. త‌మ వ్య‌క్తిగ‌త మ‌త విశ్వాసాల గురించి నోరు విప్ప‌ని గాంధీ ఫ్యామిలీ ఇప్పుడా ప‌ని చేయ‌గ‌లిగార‌నాలి.
Tags:    

Similar News