ట్రాక్ చేసి.. పెళ్లాన్ని ఆమె ప్రియుడ్ని చంపేశాడు

Update: 2017-01-15 15:56 GMT
బాలీవుడ్ క్రైం థ్రిల్లర్ ను తలపించే ఘటన ఒకటి గార్డెన్ సిటీలో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో భార్య ప్రియుడ్ని ఆమె కళ్ల ముందే భర్త తుపాకీతో కాల్చేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ప్రియుడ్ని రక్షించుకునేందుకు విఫలయత్నం చేసిన సదరు భార్య.. ప్రైవేటు ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకోవటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పలు చిక్కుముడులతోపాటు.. మరిన్ని సందేహాలు తలెత్తేలా ఉన్న ఈ ఉదంతంలోకి చూస్తే.. బెంగళూరుకి చెందిన 32 ఏళ్ల శ్రుతి గౌడ పంచాయితీ డెవలప్ మెంట్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమె.. భర్త  రాజేశ్ గౌడ (33).. మామ గోపాలకృష్ణ (78)తో కలిసి ఉన్నారు. శుక్రవారం ఇంటి నుంచి కార్లో బయటకు వెళ్లిన శ్రుతిని.. హేసర ఘట్ట ప్రాంతంలో అమిత్ కేశవమూర్తి అనే వ్యక్తిని కలుసుకున్నారు. అదే సమయంలో శ్రుతి భర్త.. అమిత్ మీద దాడి చేసి అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఘటనాస్థలంలోనే అమిత్ మరణించారు.

ఇంతకీ ఈ అమిత్ ఎవరంటే.. న్యాయవాదిగా పని చేస్తూ.. చిన్నపాటి పొలిటీషియన్. జేడీయూ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఇతగాడికి మంచి బైకర్ గా పేరుంది. తన భార్యకు.. అమిత్ కు మధ్య సంబంధం ఉందన్న సందేహమే శ్రుతిభర్త కాల్పులు జరపటానికి కారణంగా భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన భార్య  ప్రయాణించిన కారులో జీపీఎస్ లొకేటర్ ను అమర్చిన ఆమె భర్త రాజేశ్.. శ్రుతిని వెంటాడి అమిత్ మీద దాడి చేయటం.

ఈ క్రైంలో రాజేశ్ తో పాటు.. ఆయన తండ్రి గోపాల కృష్ణ కూడా సాయం చేసినట్లుగా చెబుతున్నారు. కారులో శ్రుతి.. అమిత్ లు ఉండగా ఆమె భర్త కాల్పులు జరిపినట్లుగా చెబుతున్నారు. భర్త కాల్పుల అనంతరం.. అమిత్ ను తీసుకొని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు శ్రుతి. అప్పటికే అమిత్ ప్రాణాలు పోయినట్లుగా వైద్యులు నిర్దారించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. న్యూఇయర్ పార్టీ సందర్భంగా అమిత్..  శ్రుతి ఫ్యామిలీలు ఆనందంగా పార్టీ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆసుపత్రిలో అమిత్ మరణించినట్లుగావైద్యులు చెప్పిన వెంటనే.. అక్కడి నుంచి దగ్గర్లోని లాడ్జికి వెళ్లిన శ్రుతి.. గదిలో ఆత్మహత్యకు పాల్పడటం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గజిబిజిగా ఉన్న ఈ వ్యవహారాన్ని పోలీసులు విచారిస్తున్నారు. అమిత్.. శ్రుతిల మధ్య ఎలాంటి సంబంధం ఉంది? ఆమె ప్రయాణిస్తున్న కారులో శ్రుతి భర్త జీపీఎస్ లొకేటర్ ను ఎందుకు పెట్టారు? శ్రుతి భర్త ఎందుకు కాల్పులు జరిపారు? అమిత్ మరణం తర్వాత.. శ్రుతి లాడ్జిలో రూం ఎందుకు తీసుకున్నారు? ఆమె ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి? అన్నవి ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.


Tags:    

Similar News