ఎంజీఆర్ త‌ర‌హాలో ప్ర‌జాపాల‌న చేస్తా: ర‌జ‌నీ

Update: 2018-03-06 07:55 GMT
త‌మిళ‌నాట లెజెండ‌రీ హీరో ఎంజీఆర్ ను అక్క‌డి ప్ర‌జ‌లు డెమీగాడ్ గా కొలుస్తారు. సినీ న‌టుడిగానే కాకుండా....ఏఐడీఎంకే పార్టీ స్థాపించి గొప్ప రాజ‌కీయ‌నాయకుడిగా కూడా ఎంజీఆర్ ప్ర‌జారంజ‌క పాల‌న‌ను అందించారు. ఎంజీఆర్ ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తూ లెజెండ‌రీ హీరోయిన్ - త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కూడా ప్ర‌జల‌ను త‌న పాల‌న‌తో మెప్పించారు. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.....తాను కూడా ఎంజీఆర్ త‌ర‌హాలో ప్ర‌జారంజ‌క పాల‌న‌ను చేస్తాన‌ని చెప్పారు. ఎంజీఆర్ విద్యాసంస్థ‌లో ఎంజీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ చేసిన ర‌జ‌నీకాంత్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

డీఎంకే అధినేత క‌రుణానిధి - జ‌య‌ల‌లిత ఇద్ద‌రూ గొప్ప నాయ‌కుల‌ని - అయితే - జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణం - క‌రుణానిధి అనారోగ్యం పాల‌వ‌డం వంటి ప‌రిణామాల‌తో త‌మిళ‌నాట రాజ‌కీయ అస్థిర‌త ఏర్ప‌డింద‌ని ర‌జ‌నీ అన్నారు. త‌మిళ‌నాడుకు స‌రైన నాయకుడి అవ‌స‌ర‌ముంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తాను రాజ‌కీయాల‌ను బాగా అర్థం చేసుకుంటాన‌ని - ఎంజీఆర్ బాట‌లో ప‌య‌నించి ఆయ‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా ఆయ‌న త‌ర‌హాలోనే ప్ర‌జారంజ‌క పాల‌న‌ను అందిస్తాన‌ని చెప్పారు. రాజ‌కీయాలంటే పూల బాట కాద‌ని - ఆ దారి వెంబ‌డి ముళ్లుంటాయ‌ని త‌న‌కు తెలుస‌ని చెప్పారు. క‌రుణానిధి - మూప‌నార్ లు త‌న‌కు ఇష్ట‌మైన నాయ‌కుల‌ని ర‌జ‌నీ అన్నారు. అవినీతి ర‌హిత‌ - కుల‌మ‌త ర‌హిత రాజ‌కీయాలే త‌న ధ్యేయ‌మ‌న్నారు. త‌న కోసం ఫ్లెక్సీలు - హోర్డింగ్ లు పెట్టి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించ‌వ‌ద్ద‌ని అభిమానుల‌కు సూచించారు.
Tags:    

Similar News