ఏపీ, తెలంగాణ ఏక‌మై వాయించేశారు

Update: 2015-11-11 05:47 GMT
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలంటే ఉప్పు-నిప్పు అనే ప‌రిస్థితులు ఉన్నాయ‌నే టాక్‌ లో ఎంత‌మేర‌కు నిజం ఉందో తేలిపోయే ఘ‌ట‌న‌. త‌మ‌కు విష‌యాల మీదే విభేదాలు ఉంటాయే త‌ప్పితే చిచ్చులు పెట్టే విధంగా ఉంటే చుక్క‌లు చూపిస్తామ‌ని తెలుగు రాష్ర్టాలు తేల్చిచెప్పాయి. తాజాగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఏపీ - తెలంగాణ రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌ శర్మ - ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై గుర్ర‌మన్నారు. ఇరు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనకు ఏర్పాటైన సెల్ అధికారుల తీరు పట్ల అసహనం - అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉద్యోగుల విభజన కోసం కేంద్ర ప్ర‌భుత్వం కమలనాథన్ కమిటీ ఏర్పాటుచేసి విభ‌జ‌న కోసం తీసుకోవాల్సిన చర్యలపై క‌స‌ర‌త్తు చేయాల‌ని సూచించిన సంగ‌తి తెలిసిందే. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా 150 శాఖల్లో రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన వేగంగా పూర్తి చేయాల్సి ఉందని రాజీవ్‌ శర్మ - ఐవైఆర్ కృష్ణారావు నిర్ధారణకు వచ్చారు. తాత్కాలిక (టెన్‌ టేటివ్) జాబితా రూపొందించిన తర్వాత సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని క‌మిటీ అధికారులకు వారు దిశా నిర్దేశం చేశారు. అయితే వారు సమావేశమై వారం గడుస్తున్నా ఎక్క‌డ‌వేసిన గొంగ‌డి అక్క‌డే ఉండ‌టంతో సీఎస్‌ లు ఫైర‌యిపోయారు.

వారం క్రితం జ‌రిగిన సమావేశంలో తాము దిశా నిర్దేశం చేసిన పలు అంశాల సమాచారం తెప్పించకపోవడంపై విభజన సెల్ అధికారులపై ఇద్ద‌రు సీఎస్‌ లు అసహనం వ్యక్తం చేశారు. పోలీస్‌ శాఖలోని 17 బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసుల స్థానికత వివరాలు ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్‌ కు ఎందుకు అందజేయలేదని, తీవ్రమైన జాప్యానికి కారణాలేమిటని విభజన సెల్ అధికారులను ప్రశ్నించారు. ఏపీ రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర ఎక్కువగా ఉన్నందున ఏపీ ఉద్యోగులను సొంత రాష్ర్టానికి తరలించ‌డం ముఖ్య‌మని ఈ ప్ర‌క్రియ త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని ఏపీ సీఎస్ కోరారు. నిర్దిష్ట ఫార్మాట్‌ లో సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ - ఆర్టీఏ - పే అండ్ అక్కౌంట్స్‌ శాఖల ఉద్యోగులను తెలంగాణ సీఎస్‌ ప్రశ్నించారు. పౌర సరఫరాల సంస్థలో తెలంగాణ - ఏపీ ఉద్యోగులు పరస్పర అవగాహనతో విభజన ప్రక్రియ పూర్తి చేసుకున్నా.. ఆ ఫార్ములా అమలులోకి రాకుండా అడ్డుపడుతున్న సంస్థ ఉన్నతాధికారిపై ఇద్ద‌రు సీఎస్‌ లు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. త్వరలో జరిగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం నాటికి పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని విభజన సెల్ అధికారులకు సూచించారు.
Tags:    

Similar News