ఏం చేసినా అగ్నిప‌థ్ ఆగ‌దు.. : ర‌క్ష‌ణ మంత్రి వెల్ల‌డి.. పెరుగుతున్న నిర‌స‌న‌లు

Update: 2022-06-17 09:30 GMT
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై.. సైనిక ఉద్యోగాలు కోరుకుంటున్న‌యువ‌త‌.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం కొంత‌మేర‌కు దిగివ‌చ్చి.. వ‌యో స‌డ‌లింపు ప్ర‌క‌టించింది. దీంతో కొంత మేర‌కు.. ఉద్యోగార్ధుల్లో నిర‌స‌న‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. తాజాగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం య‌వ‌త‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశారు.

అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న వేళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం విషయంలో ముందుకే వెళ్తామని, నిర‌స‌న‌ల‌కు త‌లొగ్గేది లేద‌ని స్పష్టం చేశారు. రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు అగ్నిపథ్ పథకం ఒక ‘సువర్ణావకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అగ్నిపథ్ పాలసీ కింద ఎంపికైనవారిని ‘అగ్ని వీరులు’గా గుర్తిస్తామని, నాలుగేళ్లపాటు సాయుధ బలగాల్లో వారు పనిచేయవచ్చునని సూచించారు. త్వరలోనే అగ్నిపథ్ నియామక ప్రక్రియ ఆరంభమవుతుందని తేల్చిచెప్పారు.

ఇందుకు అనుగుణంగా సన్నద్ధమవ్వాలని యువతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.  గత రెండేళ్లలో నియామకాలు చేపట్టనందున సైన్యంలో చేరాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశమని రాజ్‌నాథ్ అన్నారు.

నియామకాలు చేపట్టని కారణంగా యువత భవిష్యత్‌ దృష్ట్యా అభ్యర్థుల వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్ల సంవత్సరాలకు సడలిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మినహాయింపునిచ్చారని పేర్కొన్నారు.

అయితే ఈ సడలింపు ఈ ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. యవతకు ఉపశమనం కల్పించిన ప్రధాని మోడీకి యువకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు.  మ‌రి మంత్రి ప్ర‌క‌ట‌న నిర‌స‌న‌ల‌ను మ‌రింత రాజేసేలా ఉంద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News