కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది అందుకే...

Update: 2016-04-25 12:55 GMT
ఏపీ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదా..? త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని స్వయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు దాన్ని వాయిదా వేశారా? రెండేళ్లు పూర్తి కాకుండా కేబినెట్ విస్తరణ చేయడం ఆయనకు ఇష్టం లేదా..?  ముందున్న టార్గెట్‌ ను పూర్తి చేశాకే ఈ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుడ‌తారా?  రాజ్య‌స‌భ ఎన్నిక‌లే ఇందుకు ప్ర‌ధాన కార‌ణమా? అంటూ అధికార తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

అదిగో విస్తరణ.. ఇదిగో విస్తరణ అంటూ ఊరించినన్నాళ్లు పట్టలేదు… ఇప్పుడు మళ్లీ ఏపీ కేబినెట్ విస్తరణకు సంబంధించిన చర్చ పక్కకు వెళ్లిపోయింది. ఉగాది నాటికో.. ఆ తర్వాతో కేబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. ఆ క్రమంలో ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారు. అయితే ఉగాది దాటిపోయింది. పైగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేబినెట్ విస్తరణ ఇప్పుడే జరిగేటట్లు కనిపించడం లేదు. ఆ ప్రక్రియకు ఇంకో రెండు నెలలు ఆగాల్సిందే అంటున్నారు టీడీపీ సీనియర్‌ నేతలు.

ప్రస్తుత కేబినెట్ ఏర్పడి ఇంకా రెండేళ్లు కూడా కాలేదు…రెండేళ్లు పూర్తి కావడానికి ఇంకో రెండు నెలలు పడుతుంది. ఈలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం లేదని పార్టీలోని సీనియర్లు స్పష్టంగా చెబుతున్నారు. మంత్రులకు తమను తాము నిరూపించుకునేందుకు కనీసం రెండేళ్లు కూడా సమయం ఇవ్వకుండా మళ్లీ మార్పులు చేయడం కరెక్టు కాదనే భావనతో చంద్రబాబు ఉన్నారంటున్నారు. అందుకే ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణకు సంబంధించిన చర్చకు తాత్కాలికంగా తెరపడిందంటున్నారు.

ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికలు ముగిసాకే కేబినెట్ విస్తరణపై దృష్టి సారించాలని సీఎం భావిస్తున్నారట. ముందుగా రాజ్యసభ ఎన్నికలు.. ఎవరెవరికి పదవులు కట్టబెట్టాలనే అంశంపై కసరత్తు పూర్తి చేసి.. ఆ ప్రక్రియ అయిపోయాక.. కేబినెట్ విస్తరణపై బాబు దృష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు సీఎం సన్నిహితులు. ఏదీ ఏమైనా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. ఏదైనా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే తప్ప మరో రెండు నెలల వరకు కేబినెట్ విస్తరణ ఊసే ఉండదంటున్నారు.
Tags:    

Similar News