టీఆరెస్‌లో రాజ్యసభ రచ్చ

Update: 2020-03-10 16:35 GMT
టీఆరెస్‌లో పదవుల పంచాయతీ మరోసారి రచ్చకెక్కింది. మాజీ హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి రాజ్యసభ టికెట్ తనకు కావాలంటూ హల్ చల్ చేస్తున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కేసీఆర్ తనకు రాజ్యసభ టికెట్ ఎలా ఇవ్వడో చూస్తానంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో రెండు రాజ్యసభ పదవులు, ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీ ఏర్పడడంతో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అధికార పార్టీ నేతల దృష్టి మొత్తం ఈ రెండు రాజ్యసభ టికెట్ల మీదనే ఉంది. రెండు సీట్లల్లో ఒకటి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుకు కేటాయించినట్లు తెలుస్తోంది. రెండో వ్యక్తి కోసం అన్వేషణ కొనసాగుతున్నదంటున్నారు. ఈ నెల 11న లేదా 12న అభ్యర్ధుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండో టికెట్ కోసం ముగ్గురు నలుగురి పేర్లు పరిశీలనలో ఉండడంతో ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

టీఆర్ఎస్ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో నాయిని నర్సింహారెడ్డికి చోటు దక్కలేదు. ఇంత కంటే మంచి పదవి వస్తుందిలే అని సీఎం అప్పట్లో ఆయనకు సర్దిచెప్పారు. ఉన్న ఎమ్మెల్సీ పదవీకాలం కూడా దగ్గర పడుతుండడంతో తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను కలిసి కోరినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇటీవల నాయిని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య మీడియా సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. రాజ్యసభ టికెట్ కాకుండా కార్పొరేషన్ చైర్మన్ లేదా మరోమారు ఎమ్మెల్సీ ఇవ్వాలన్న ఆలోచనతో పార్టీ అగ్రనాయకులు ఉన్నట్లు తెలువడంతో తాజాగా ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘‘మా పునాదుల మీద నిర్మించిన భవనంలో మాకు చోటు ఇవ్వకపోవడమేంది.. నాకు రాజ్యసభ టికెట్ ఎట్లా ఇవ్వడో చూస్తానంటూ’’ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.
Tags:    

Similar News