అదీ.. రాజ‌గురువు రాజ‌సం

Update: 2015-10-20 09:59 GMT
ఒక వ్య‌క్తి ఎంత‌కాలం చ‌క్రం తిప్ప‌గ‌ల‌రు? ఏడాది.. రెండేళ్లు.. కాదంటే ప‌దేళ్లు.. ఇంకా అంటే 20 ఏళ్లు. కానీ.. రామోజీ గ్రూపుల అధినేత చెరుకూరి రామోజీరావు మాత్రం అందుకు భిన్నం. దాదాపు 40 ఏళ్లుగా నాన్ స్టాప్ గా చ‌క్రం తిప్ప‌గ‌ల స‌త్తా ఆయ‌న సొంతం. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తెలుగు నేల మీద ముఖ్య‌మంత్రిగా ఎవ‌రున్నా స‌రే.. వారు అయితే స్నేహ‌మైనా చేయాలి. లేదంటే క‌త్తి దూయాలి.

రామోజీ ప్ర‌త్యేక ఏమిటంటే స్నేహానికి ఎంత విలువ ఇస్తారో.. వైరానికి అంతే ప్రాధాన్య‌త ఇస్తారు. ఆస‌క్తి క‌లిగించే అంశం ఏమిటంటే.. స్నేహంలోనూ.. వైరంలోనూ వ్య‌క్తిగ‌తం కంటే కూడా అంత‌కు మించిన విష‌యాలే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.

ఎన్టీవోడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నాటి నుంచి నేటి వ‌ర‌కూ అంద‌రు రాజ‌కీయ నేత‌లు స్నేహం కోరుకునే వ్య‌క్తి రామోజీ కావ‌టం గ‌మ‌నార్హం. వైఎస్ హ‌యాంలోని ఆరేళ్ల‌లో.. వైఎస్‌.. రామోజీల మ‌ధ్య వైరం ఏస్థాయిలో సాగిందో తెలిసిందే. ఏ ద‌శ‌లోనూ వెన‌క్కి త‌గ్గ‌కుండా తాను న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డిన ఆయ‌న‌.. వైఎస్ దుర్మ‌ర‌ణం పాలైన త‌ర్వాత జ‌గ‌న్ తోనూ పోరు సాగించారు.

ఉప్పు.. నిప్పులా ఉండే వైఎస్‌.. రామోజీల వ్య‌వ‌హారంలో చాలా త‌క్కువమందికి తెలిసిన మ‌రో కోణం కూడా ఉంది. వైఎస్ హ‌ఠ్మార‌ణం వార్త‌ను విని రామోజీ చాలా క‌దిలిపోయార‌ని చెబుతారు. వైఎస్ కుటుంబాన్ని క‌లిసి ఓదార్చాల‌ని ఆయ‌న భావిస్తే.. ఆయ‌న స‌న్నిహితులు కొంద‌రు వ‌ద్ద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేస్తే వారి వంక కోపంగా చూడ‌ట‌మే కాదు.. అదేమాత్రం మంచిప‌ద్ధ‌తి కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతారు.

వైఎస్ అంతిమ యాత్ర గురించి ఎలాంటి వార్త‌లు ఇవ్వాల‌న్న సందిగ్థ‌త‌లో ఉన్న త‌న బృంద స‌భ్యుల‌కు ఆయ‌న చెప్పిన మాట విన్న‌ప్పుడు రామోజీలోని మ‌రో కోణం తెలుస్తుంది. జ‌నం మ‌న‌సుల్ని గెలుచుకున్న ఆయ‌న‌కు ఎలా వీడ్కోలు ప‌లుకుతారో నేను చూస్తాన‌ని ఆయ‌న అన్న మాట‌ల‌కు ప్ర‌తిరూపంగా ఆ త‌ర్వాతి రోజు ఈనాడు దిన‌ప‌త్రిక ఉంద‌ని చెబుతారు.

వైరం విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌ని ఆయ‌న‌.. మాన‌వ‌త్వం కోణంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటిగా చెబుతారు. వైఎస్ భౌతిక‌కాయాన్ని చూసేందుకు వెళ్లిన స‌మ‌యంలో జ‌గ‌న్ ను అనున‌యించ‌టానికి రామోజీ ప్ర‌య‌త్నిస్తే.. అందుకు జ‌గ‌న్ భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఈ విష‌యాన్ని గుర్తించి కేవీపీ రామచంద్ర‌రావు క‌ల్పించుకొని రామోజీకి స‌ర్ది చెప్ప‌టం అక్క‌డే ఉన్న ప‌లువురు జ‌ర్న‌లిస్టులు గ‌మ‌నించ‌క‌పోలేదు.

అయితే.. జ‌గ‌న్ వైఖ‌రిని  పెద్ద‌గా ప‌ట్టించుకోని రామోజీ.. ఈ మ‌ధ్య‌నే జ‌గ‌న్ త‌న ఇంటికి వ‌స్తాన‌ని చెబితే.. ఓకే అన్నారేకానీ వ‌ద్ద‌న‌లేదు. త‌న బొమ్మ‌ను బ‌ట్ట‌ల్లేకుండా.. చిన్న గోచి గుడ్డ‌తో సాక్షి పేప‌ర్ లో భారీగా అచ్చేయించినా రామోజీ దాన్ని స్పోర్టివ్ గా తీసుకున్నారే కానీ.. మ‌న‌సులో పెట్టుకొని.. అలాంటి జ‌గ‌న్ తో నేను మాట్లాడేదేమిట‌ని బిగుసుకుపోలేదు.

నిజానికి జ‌గ‌న్ తో భేటీ కార‌ణంగా రామోజీని విప‌రీతంగా అభిమానించే వారు షాక్ తిన్నార‌ని చెబుతారు. అయితే.. దూర‌దృష్టితో వ్య‌వ‌హ‌రించే రామోజీ.. విధానప‌ర‌మైన వైరానికి.. వ్య‌క్తిగ‌త శ‌త్రుత్వానికి మ‌ధ్య విభ‌జ‌న రేఖ స్ప‌ష్టంగా ఉండాల‌న్న విష‌యాన్ని ఆయ‌న అస్స‌లు మ‌ర్చిపోరు. అందుకే కాబోలు త‌న ఇంటికి వ‌స్తాన‌న్న జ‌గ‌న్ ను ర‌మ్మ‌ని చెప్ప‌ట‌మే కాదు.. సాద‌రంగా ఆహ్వానించి ఘ‌నంగా అతిధ్యమిచ్చి పంపారు.

త‌న‌కు ఆగ‌ర్భ శ‌త్రువులాంటి జ‌గ‌న్ ను ఆద‌రించ‌టం రామోజీకి మాత్ర‌మే చెల్లుతుందేమో. అదే స‌మ‌యంలో నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్ర‌బాబు.. కేసీఆర్ ల వ‌ర‌కూ అంద‌రు ముఖ్య‌మంత్రులు త‌న‌కెంతో గౌర‌వం ఇచ్చేలా వ్య‌వ‌హ‌రించ‌టం రామోజీకి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో.  తాజాగా అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ఏపీ ముఖ్య‌మంత్రి హెలికాఫ్ట‌ర్ వేసుకొని వ‌చ్చి మ‌రీ ఆహ్వానం ఇచ్చి వెళ్లారంటే ఆయ‌న రేంజ్ ఏమిటో తెలుస్తుంది. ఒక్క చంద్ర‌బాబు మాత్ర‌మే కాదు.. ఆ మ‌ధ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం వ‌చ్చి దాదాపు ఐదారు గంట‌లు ఆయ‌న‌తో గ‌డిపిన తీరు చూస్తే.. రామోజీ స‌మ్మోహ‌నం మ‌రెవ‌రికీ సాధ్యం కాద‌నిపించ‌క మాన‌దు.

అంతేనా.. ముఖ్య‌మంత్రులే కాదు..ప్ర‌ధాని మోడీ లాంటి వారు సైతం రామోజీ దోస్తీకి అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌టం చూసిన‌ప్పుడు.. రాజ‌గురువ‌ని ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించినా.. ఆ మాటకు ఆయ‌న మాత్ర‌మే స‌రిపోతార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ద‌శాబ్దాల పాటు ఒకేలాంటి హోదాని.. గౌర‌వాన్ని కొన‌సాగించ‌టం అంత చిన్న విష‌యం కాదు. ఆ విష‌యంలో రామోజీకి మ‌రెవ‌రూ పోటీ రాలేరన‌టంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు.
Tags:    

Similar News