అలాంటి ప్రకటన నేను చేయలేదన్న రతన్ టాటా

Update: 2021-09-05 01:30 GMT
అసలే ఇదీ సోషల్ మీడియా కాలం.. ఎవ్వరు ఏదీ మాట్లాడినా.. తప్పుగా మాట్లాడినా సరే ఇట్టే దొరకబట్టి ట్రోలింగ్ చేస్తున్న రోజులివీ.. అందరి తరుఫునా ఎవరో ఒకరు ఏదో ఒకటి ప్రచారం చేస్తూ ఉంటారిక్కడ.. ఈ విషయంలో పెద్ద పెద్ద వాళ్లను కూడా నెటిజన్లు వదలరు.. వారి పేరుతో వీళ్లే ఏదో ఒకటి పోస్ట్ చేస్తారు.

ప్రత్యేకించి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, నలుగురిలో పేరున్న వారి పేరుతో రకరకాల ఫేక్ మెసేజ్ లను పాస్ చేయడం సోషల్ మీడియాలో రోటీన్ గా మారింది. ఇలాంటి వాటి వైపు ఓ లుక్కేస్తే చాలా కనిపిస్తాయి.

చాణక్యుడి నుంచి సుందర్ పిచాయ్ దాకా.. మహాత్ముడి నుంచి మోడీ దాకా ఏవేవో సూక్తులను ప్రచారం చేస్తుంటారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అసలివా? నకిలీవా? అన్నది కనుక్కోవడం చాలా కష్టం.

వాట్సాప్ యూనివర్సిటీ మేధావులకు ఏదో ఒకటి సృష్టించడమే పని. వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లను కూడా సోషల్ మీడియా వదలదు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా పేరుతో ఒక పోస్టు కొన్నాళ్లుగా తెగ షేర్ అవుతోంది. దాని సారాంశం ఏంటంటే.. ‘మద్యం అమ్మకాలకూ ఆధార్ కు అనుసంధానం చేయాలట.. సంక్షేమ పథకాలకూ ఆ అనుసంధానం చేయాలట.. అప్పుడు అసలు కథ బయటకు వస్తుందట.. ’ ఇది రతన్ టాటా చెప్పినట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఇది దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో వైరల్ అయ్యేసరికి చివరకు రతన్ టాటా వద్దకు వెళ్లిందట.. దీంతో ఆయన స్పందించక తప్పలేదు. ‘తాను మద్యం-ఆధార్ స్టేట్ మెంట్ ఇవ్వలేదని’ స్వయంగా రతన్ టాటా వివరణ ఇచ్చుకున్నాడు. ఇలా రతన్ టాటా కూడా సోషల్ మీడియా యూనివర్సిటీల ఫేక్ రాతల దెబ్బకు దిగివచ్చాడన్న మాట..




Tags:    

Similar News