చాలు.. సీమ మ‌న‌సు దోచేశారు.. జ‌గ‌న్‌ పైనే సోష‌ల్ టాక్!

Update: 2020-10-07 17:40 GMT
ఎక్క‌డ మాట్లాడాలో అక్క‌డ ఖ‌చ్చితంగా మాట్లాడాలి! వేదిక మీదెక్కి మాట్లాడ‌క‌పోయినా.. వేదిక దిగాక‌.. లొడ‌లొడా వాగినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌దు. మీడియా ముందుకు వ‌చ్చి.. చింపేస్తాను.. క‌రిచేస్తాన‌ని.. ప్ర‌గ‌ల్భాలు ప‌లికి.. తీరా రంగంలోకి దిగాక‌.. అస్త్ర‌స‌న్యాసం చేసి.. నోటికి తాళం వేసుకున్నా.. అంతే!! బ‌హుశ ఇలాంటివి తెలుసో.. ఏమో.. తెలియ‌దు కానీ.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్‌.. ఎక్క‌డ నోరు విప్పాలో అక్క‌డ విప్పుతున్నారు. ఎక్క‌డ మౌనం పాటించాలో.. అక్క‌డ అలానే ఉంటున్నార‌ని అంటున్నారు సోష‌ల్ మీడియాలో జ‌నాలు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ అదికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా జ‌ల వివాదాలు స‌మ‌సి పోతాయ‌ని అనుకున్నారు. దీనికి కార‌ణం.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు కావ‌డం, సీఎం ప్ర‌మాణ స్వీకారానికి ఆయ‌న హాజ‌రుకావ‌డం! అయితే, జ‌లాల విష‌యంలో తెలంగాణ చేస్తున్న తొండిని గ్ర‌హించిన జ‌గ‌న్‌.. ముఖ్యంగా తెలంగాణ శ్రీశైలం జ‌లాశ‌యం నుంచి తోడేస్తున్న నీటి కార‌ణంగా.. సీమ ప్రాంతాలు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయ‌ని లెక్క ప్ర‌కారం ఏడాదికి 100 టీఎంసీలు రావాల్సి ఉన్నా.. కేవ‌లం 50 కూడా రావ‌డం లేద‌ని గ్ర‌హించారు.

దీంతో పోతిరెడ్డి పాడు హైరెగ్యులేట‌ర్ ఎత్తును పెంచి.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌ ప్రాజెక్టుకు శ్రీకారం చ‌ట్టారు. దీనిని కేసీఆర్ తీవ్రంగా విభేదించారు. చివ‌రాఖ‌రుకు కేంద్రం వ‌ద్ద‌కు చేరిన పంచాయ‌తీలో జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో గ‌ళం విప్పిన తీరు న‌భూతో అన్న విధంగా ఉంద‌నేది ప‌రిశీల‌కుల మాటే కాదు.. ప్ర‌తిప‌క్షాల మాట కూడా!! ఇప్ప‌టి వ‌ర‌కు రాయ‌ల‌సీమ ప్ర‌యోజ‌నాల విష‌యంలో జాతీయ వేదిక‌గా మాట్లాడిన సీఎం లు లేరు. కానీ, ఇప్పుడు త‌న‌కు మిత్రుడు.. పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో ఢీఅంటే ఢీ అనేలా సీమ ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించిన తీరుకు.. సీమ ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

``ఇది చాలు. ఈ మాత్రం మాట్లాడిన నాయ‌కులు ఉన్నారా?`` అనే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పోతిరెడ్డిపాడుకు అనుమ‌తులు లేవ‌న్న కేసీఆర్ వాద‌నకు దీటుగా జ‌గ‌న్‌.. మీ కాళేశ్వ‌రానికి ఉన్నాయా? అని ప్ర‌శ్నించ‌డం.. అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోను చేసింది. ఎక్క‌డ గ‌ళం విప్పాలో అక్క‌డ విప్పార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి కేసీఆర్‌పై ప‌రోక్షంలో అనేక విమ‌ర్శ‌లు చేసే నాయ‌కులు కూడా ఆయ‌న ముందు మాట్లాడేందుకు పెద్దగా ఆస‌క్తి చూప‌రు. ఆయ‌న మాట‌ల మాంత్రికుడు. ఇలాగే జ‌గ‌న్ కూడా తుస్సుమ‌నిపిస్తార‌ని అనుకున్నారు. కానీ, కేసీఆర్‌కు చుక్క‌లు చూపించార‌నే వాద‌న వ‌స్తుండ‌డం జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలికి అద్దం ప‌డుతోంది. నిత్యం మీడియా ముందుకు వ‌చ్చి గంట‌ల త‌ర‌బ‌డి సుత్తి కొట్టి సాధించ‌లేని నాయ‌కుల కంటే.. సీమ వేద‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌.. జ‌గ‌న్ తీరు భేష్ అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News