మాస్టర్‌ కార్డ్‌కు భారీ షాకిచ్చిన ఆర్‌బీఐ .. ఏంచేసిందంటే ?

Update: 2021-07-15 05:50 GMT
మనదేశంతో పాటుగా పలు దేశాల్లో వివిధ బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సేవలు అందించే మల్టీనేషనల్ సంస్థ మాస్టర్ కార్డ్ కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. మాస్టర్ కార్డు పై  ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్‌ కార్డుల పై ఆంక్షలు విధించింది. కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కార్డు నెట్‌ వర్క్‌ లో కొత్త కస్టమర్లను పొందకుండా నియంత్రణలు విధించింది.

ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు జూలై 22 నుంచి అమలులోకి రాబోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ...  జూలై 22 నుంచి మాస్టర్ కార్డు కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ కావు.పేమెంట్ సిస్టమ్స్ డేటా స్టోరేజ్‌కి సంబంధించి ఆర్‌ బీఐ రూపొందించిన నిబంధనలను మాస్టర్ కార్డు అతిక్రమించడం దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మాస్టర్ కార్డ్ కంపెనీకి తగినంత సమయం, అవసరమైన అవకాశాలు ఇచ్చినా కూడా.. ఆ సంస్థ పేమెంట్ సిస్టమ్ డేటా స్టోరేజ్‌ ఆదేశాలకు అనుసరించలేదని ఆర్బీఐ వెల్లడించింది. అందుకే ఆ కంపెనీ కార్యకలాపాలపై ఆంక్షలు విధించామని ఆర్బీఐ తెలిపింది.

కాగా ఆర్బీఐ నిర్ణయం వల్ల ఇప్పటికే మాస్టర్ కార్డు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదని గమనించాలి. అయితే పౌరుల వ్యక్తిగత డేటాను మరింత సురక్షితం చేసేలా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసుల రంగానికి సంబంధించి మోదీ సర్కారు కొన్ని నిబంధనలను సవరించింది. దాని ప్రకారం  దేశంలో ఆర్థిక సేవలు అందించే మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ ప్రెస్, వీసా కార్డ్ తదితర సంస్థలు ఇక్కడ జరిగే పేమెంట్స్‌ కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలనే నిబంధనను తీసుకొచ్చారు. అయితే ఆర్బీఐ ఇచ్చిన గడువులోగా నిబంధనల పాలనలో విఫలం కావడంతో మాస్టర్ కార్డు పై ఆంక్షలు విధించారు. పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌ మెంట్‌ సిస్టమ్స్‌ చట్టం 2007ను   అనుసరించి మాస్టర్ కార్డు సంస్థపై చర్యలు తీసుకున్నట్లు ఆర్‌ బీఐ తెలిపింది. మాస్టర్‌ కార్డ్‌ కు పీఎస్ ఎస్ చట్టం కింద దేశంలో కార్డు నెట్ వర్క్ ఆపరేట్ చేయడానికి అధికారం ఇచ్చారు. గతంలో అమెరికన్‌ ఎక్స్‌ ప్రెస్‌, డైనర్స్‌ క్లబ్‌ కార్డులపైనా ఆర్‌ బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది.
Tags:    

Similar News