ఇది బ్యాంకుల పునాదులు కదిల్చే ప్రక్రియా!?

Update: 2016-12-23 00:30 GMT
నగదు రహిత ఆర్థిక వ్యవస్థను, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా అంటూ.. బ్యాంకు, ఏటీఎం నుంచి తీసుకునే నగదుపై సర్‌ ఛార్జి విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఈ ఛార్జి 0.5 - 2 శాతం మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వీలైనంత త్వరగా... అంటే ఈ నెల 30 నుంచి కానీ నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి కానీ ఇది అమల్లోకి రానుందని తెలుస్తుంది. కనీస పరిమితికి మించి నగదు తీసుకుంటే ఈ సర్‌ ఛార్జి వర్తిస్తుందనేది కండిషన్ గా ఉంది. బ్యాంకుల నుంచి రోజుకు రూ.50 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ.15 వేలు మించి విత్‌ డ్రా చేసుకుంటే ఈ సర్‌ ఛార్జి విధించే అవకాశం ఉందట. దీనిపేరు "నిర్వహణ వ్యయం". ఈ నిర్ణయం అమలైతే ఏమి జరగబోతుంది.. దీని తాలుకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. ఇవి బ్యాంకుల మనుగడను ప్రశ్నార్థకం చేసేవా లేక సామాన్యుడికి కొత్త కోతలను తెచ్చి పెట్టేవా.. బ్యాంకుల్లో డబ్బు దాచుకోవాలంటే కోతలకు సిద్దపడాలనే సంకేతాలు ఇచ్చేవా... ఒకసారి పరిశీలిద్దాం!

ప్రస్తుతం వస్తున్న కథనాలే వాస్తవాలయితే, ఈ నిర్వహణ వ్యయం సర్ ఛార్జికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రజలు అందుకు సిద్దంగా ఉంటారా. ముఖ్యంగా సామన్యుడిపై ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది. ఈ కథనాలను బట్టి చూస్తే... బ్యాంకుల్లో ఒకరోజు ఎంత అత్యవసరమైనాసరే రూ. 50వేలకు మించి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలా ఏభైవేలకు మించి విత్ డ్రా చేసుకుంటే 2శాతం ఛార్జ్ లెక్కన 1000 రూపాయలు కట్ అవూతాయి. అలా కాకుండా ఏటీఎం ల ద్వారా 15వేల రూపాయలు మించి తీసుకుంటే ఆ రెండు రూపాయల సర్ ఛార్జ్ లెక్కన సుమారు రూ. 250 వరకూ కట్ అయ్యే అవకాశాలున్నాయన్నమాట. అంటే... ఏటీఎం లలో ఒకరోజులో రూ. 15వేలు మించి తీసుకునే ప్రతిఒక్కరూ 100 నుంచి 250 రూపాయల వరకూ వదులుకోవడానికి సిద్దపడాలన్నమాట.

అయితే ఈ విషయాలన్నీ తెలిసిన అనంతరం సామాన్యుడు బ్యాంకులలో నగదు దాచుకోవడానికి ఏస్థాయిలో ముందుకు వస్తాడనేది పెద్ద ప్రశ్నే!! అవసరాలకు ఎవరి డబ్బు వారు తీసుకోవడానికి కూడా బ్యాంకులకు ఛార్జి కట్టాల్సి రావడం అనే విషయం సామాన్యుడి అంగీకారానికి నోచుకుంటుందనేది కూడా మరో ప్రశ్నే!! దీంతో వీలైనంత వరకూ బ్యాంకులలో నగదు దాచుకోవడం అనే ప్రక్రియకు ఈ సర్ ఛార్జి అనే అంశం అడ్డుకాబోతుందా? నోట్ల రద్దు వ్యవహారం అనంతరం రకరకాల విశ్లేషణల్లో భాగంగా ఇప్పటికే బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు ప్రభావం బ్యాంకుల మనుగడకు ఎలాంటి ప్రభావం చూపించబోతుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనా... గత ప్రభుత్వాల హయాంలో సీబీఐ వంటి అత్యున్నత వ్యవస్థ గురించి సామాన్యుడు కూడా తక్కువచేసి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందనే విమర్శలు ఎదురైనట్టుగానే... ఈ ప్రభుత్వం హయాంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యేలా ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ వీలైనంత త్వరలో పరిష్కారాలు దొరికి వ్యవస్థ మొత్తం తొందరలోనే గాడిన పడాలని సామాన్యుడు కోరుకుంటున్నాడు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News