విడి పోయాక తెలంగాణ ఇంత బంగారం అయ్యిందా..!

Update: 2021-11-26 13:30 GMT
సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర నాయకుల పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్న చర్చలు తెలంగాణ ప్రజల నుంచి ఎక్కువగా వినిపించాయి. తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న స‌మ‌యంలో కూడా ఆ ప్రాంత రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా ఇదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల్లో ప్రత్యేకంగా ఉన్న‌ రాష్ట్ర ఆకాంక్ష 2014లో నెరవేరింది. 2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్క‌డ ప్ర‌తీది బంగారంగా మారిపోయిందిన ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది.

ఈ ఏడు ఏళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా ఊహించని విధంగా పెరిగిందని ఆర్బిఐ స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్ప‌డ్డాక మూడింత‌ల‌ వృద్ధి రేటు నమోదైనట్టు చెప్పింది. కేవలం ప‌న్నేత‌ర ఆదాయం మాత్రమే కాదని... ప‌న్నుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగేలా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని ఆర్బీఐ చెబుతోంది. వ్యవసాయోత్పత్తుల వృద్ధిలో గత 50 సంవత్సరాల తో పోలిస్తే తెలంగాణలో ఊహించని విధంగా మార్పులు వచ్చాయట.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే 2014-15లో 29,288 కోట్లు ఉన్న ఆదాయం కాస్తా ఇప్పుడు 2020-21లో ఆదాయం 85,300 కోట్లకు చేరుకుంది. ఈ ఏడేళ్ల‌లోనే జీఎస్డీపీ ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. 2014-15తో పోల్చితే.. 2020-21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం పెరిగింది. ఇక వ్య‌వ‌సాయ ధాన్యాల ఉత్ప‌త్తిలో దేశ స‌గ‌టుతో పోలిస్తే తెలంగాణ 3-4 రెట్లు వృద్ధి రేటు న‌మోదు చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక ఇక్క‌డ నీటి వ‌న‌రుల ల‌భ్య‌త పెర‌గ‌డంతో పాటు వ్య‌వ‌సాయ భూమి పెర‌గ‌డం, మార్కెట్లు పెర‌గ‌డంతో వ్య‌వ‌సాయ రంగంలో ఎక్కువ ఆదాయం రావ‌డానికి కార‌ణ‌మైంది. దీంతో పాటు ఐటీ, పారిశ్రామిక‌, మైనింగ్ రంగాలు కూడా భారీగా వృద్ధి రేటు న‌మోదు చేశాయి. అయితే ఈ ఏడేళ్ల‌లో ఆస్తులు ఎంత‌లా పెరిగాయో అప్పులు కూడా అంతే పెరిగాయ‌ట‌.

2021 మార్చి నాటికి రూ.2,52,325 కోట్లకు అప్పులు చేరాయి. ఆరేళ్లలో రు 1.80 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశారు. అయితే పెరిగిన ఆదాయంతో పోలిస్తే ఈ అప్పులు పెద్ద‌లెక్క కాద‌ని ఆర్థిక విశ్లేష‌కులు చెపుతున్నారు. ఆ అప్పుల‌కు త‌గిన‌ట్టుగా ఇక్క‌డ చాలా ప్రాజెక్టుల నిర్మాణం జ‌రిగింద‌ని వారు చెపుతున్నారు. ఇవ‌న్నీ ధీర్ఘ‌కాలంలో ఆదాయాన్ని మ‌రింత పెంచుతాయంటున్నారు.
Tags:    

Similar News