ఊరట.. కొత్త వంద నోట్లు వస్తున్నాయ్

Update: 2016-12-06 18:02 GMT
దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ నోట్లను రద్దు చేసేసింది ప్రభుత్వం. మిగతా 14 శాతం ఉన్న 100.. 50.. 20.. 10 నోట్లతో లావాదేవీలు జరపలేక నానా ఇబ్బందులు పడుతున్నారు అందరూ. ఉన్న నోట్లలో కూడా జనాల దగ్గర ఉన్నది చాలా తక్కువ శాతం. కొత్తగా 2000 నోటు వచ్చినా.. దానికి చిల్లర దొరక్క అది చెల్లని నోటు లాగా మారిపోయింది. 500 నోట్లు ఇంకా అనుకున్న స్థాయిలో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో వంద నోట్ల విలువ అమాంతం పెరిగిపోయింది. వంద నోటు ఉన్న వాడు కింగ్ ఇప్పుడు. ప్రస్తుతం దేశంలో వంద నోట్ల కొరతను దృష్టిలో ఉంచుకుని కొత్త వంద నోట్లను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది.

త్వరలోనే కొత్త రూ.100 నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. పాత నోట్లతో పోలిస్తే కొత్త నోట్లలో కొన్ని మార్పులు కూడా ఉంటాయని సూచించింది. కొత్త నోట్లలో నంబర్ ప్యానల్స్ లో ఇన్ సెట్ లెటర్ ఉండదని.. నోటుపై నంబర్లు ఆరోహణ క్రమంలో పెద్దవి అవుతూ కనిపిస్తాయని.. ఐడెంటిఫికేషన్ మార్కు పెద్దగా ఉంటుందని.. ఇంకా చిన్న చిన్న మార్పులుంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ ప్రకటనలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. పాత వంద నోట్లను రద్దు చేయకపోవడం. పాత నోట్లు యధావిధిగా చలామణిలో ఉంటాయని.. అవి రద్దవుతాయేమో అని ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. కొత్త నోట్లు సాధ్యమైనంతగా అందుబాటులోకి వచ్చాక.. కొన్నేళ్ల తర్వాత పాత నోట్లను రద్దు చేసే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కొత్తగా 50.. 20 నోట్లను ముద్రించనున్నట్లు ఆర్బీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తానికి కొన్నేళ్లలో పాత నోట్లన్నీ పోయి.. అన్నీ కొత్త నోట్లే చలామణిలోకి రావచ్చేమో.
Tags:    

Similar News