కరోనా వేళ..దేశంలోని రియల్ రంగానికి పడిన దెబ్బ మామూలుగా లేదుగా?

Update: 2020-04-24 05:15 GMT
ఆర్థిక మందగమనంతో కిందామీదా పడుతున్న రియల్ రంగానికి కరోనా కారణంగా పడిన దెబ్బ మామూలుగా లేదు. ఈ ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే.. కరోనా కారణంగా చోటు చేసుకున్న పరిణామాల పుణ్యమా అని దేశంలోని తొమ్మిది నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత భారీ ప్రభావానికి గురైందన్న షాకింగ్ లెక్కలు తాజాగా బయటకు వచ్చాయి. ఏడాదిలోని మొదటి మూడు నెలల అమ్మకాలతో పోలిస్తే.. తాజాగా 39 శాతం అమ్మకాలు తగ్గిన వైనాన్ని గుర్తించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఇది 26 శాతంగా అంచనా వేశారు.

హౌసింగ్ డాట్ కామ్.. మకాన్ డాట్కామ్.. ప్రోప్ టైగర్ డాట్ కామ్ లు జరిపిన అధ్యయనాల్లో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో మొత్తంగా 69,235 ఇళ్లు అమ్ముడు కాగా గత ఏడాది మొదటి మూడు నెలల్లో 93,936 ఇళ్లు అమ్ముడైనట్లుగా గుర్తించారు. తాము అధ్యయనం చేసిన తొమ్మిది నగరాల్లో రియల్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని.. అమ్మకాలు భారీగా పడిపోయినట్లుగా లెక్క వేశారు.

రానున్న మూడు నెలల్లోనూ రియల్ రంగానికి ఊరటనిచ్చే పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేవని చెబుతున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అని రానున్న రోజుల్లో పెను మార్పులు చోటు చేసుకునే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తుల్ని నేరుగా వచ్చి చూసే ధోరణి తగ్గి.. ఆన్ లైన్ లో చూసి కొనుగోలు చేసే అలవాటు ఎక్కువ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

మొబైల్ ఫోన్లు ఏ రీతిలో అయితే ఆన్ లైన్ లో అమ్మకాలు జోరందుకున్నట్లే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆన్ లైన్ ఎంక్వయిరీలు.. బ్రోచర్లను చూడటం.. బుకింగ్ లు కూడా ఆన్ లైన్లోనే చేసుకునే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల అమ్మకాలు దారుణంగా పడిపోయిన నగరాల్లో మొదటి స్థానం గురుగ్రామ్ దే.

ఆ నగరంలో రియల్ రంగంలో అమ్మకాలు 73 శాతం మేర పడిపోయాయి. తర్వాతి స్థానంలో కోల్ కతా నిలిచింది. ఆ నగరంలో 41 శాతం క్షీణత నమోదు కాగా.. మూడో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. 39 శాతం మేర అమ్మకాలు పడిపోయినట్లుగా తేల్చారు. అహ్మదాబాద్ లో 36 శాతం.. నోయిడాలో 26 శాతం.. బెంగళూరులో 24 శాతం.. చెన్నైలో23 శాతం తగ్గగా.. అతి తక్కువగా ఫుణె (15శాతం).. ముంబయి (14 శాతం) తగ్గినట్లుగా చెబుతున్నారు. మిగిలిన నగరాల్లో అమ్మకాలు భారీగా పడిపోయిన వేళ.. ముంబయి.. ఫూణె నగరాల్లో ఎందుకంతగా పడిపోలేదన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News