బాబు ఊరికే ఫైర్ అవుతున్నారా?

Update: 2016-01-26 22:30 GMT
శాంతంగా ఉండ‌టం.. న‌వ్వుతూ మాట్లాడ‌టం లాంటివి చంద్ర‌బాబు లాంటి నేత నుంచి ఏ మాత్రం ఊహించ‌ని విష‌యాలు. వాయువేగంతో క‌ద‌ల‌టం.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సింహ‌స్వ‌ప్నంగా ఉండ‌టం.. నేను నిద్ర‌పోను.. మిమ్మ‌ల్ని నిద్ర‌పోనివ్వ‌నంటూ క‌ల‌లో కూడా బెత్తం ప‌ట్టుకున్న బాబు క‌నిపించేవాడంటూ ప్ర‌భుత్వ ఉద్యోగులు చెప్పే మాట‌లు గ‌తంగా మారిపోయాయి. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించి అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టిన చంద్ర‌బాబు.. వ్య‌వ‌హారాల్ని వీలైనంత సామ‌ర‌స్యంగా పూర్తి చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

రాజ‌కీయంగా తాను గ‌డ్డురోజులు ఎదుర్కొన్న‌ప్పుడు త‌న‌తో నిలిచిన వారంతా ప్ర‌యోజ‌నం పొందాల‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న కాస్త చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం పెరిగింది. అవినీతికి గేట్లు ఎత్తేసిన వైఎస్ ను మ‌హానేత‌గా కీర్తిప్ర‌తిష్ట‌లు అందుకోవ‌టం తెలిసిందే. దీంతో.. తాను కూడా ఉదారంగా ఉండ‌టం ద్వారా వీలైనంత ఎక్కువ మంది మ‌న‌సుల్ని దోచుకోవాల‌న్న భావ‌న బాబులో పెరిగింది. అందుకే.. తాను సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత చాలా వ్య‌వ‌హారాల్లో చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం మొద‌లెట్టారు.

అయితే.. బాబు భావాన్ని త‌ప్పుగా అర్థం చేసుకున్న పార్టీ నేత‌లు.. అధికారులు.. ఎవ‌రికి వారు అన్న రీతిలో చెల‌రేగిపోవ‌టం.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం బాబు వైఖ‌రిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెళ్లే వ‌ర‌కూ వెళ్లింది. మంచిత‌నం.. మెత‌క‌ద‌నం వేర్వేరు అంశాల‌ని.. కానీ రెండింటిని క‌ల‌బోసి బాబు త‌ప్పు చేస్తున్నార‌న్న వాద‌న పెరిగింది. చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న బాబు వైఖ‌రితో ప్ర‌భుత్వానికి లాభం కంటే న‌ష్టమే ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తుండ‌టంతో బాబు కాస్త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌టం మొద‌లు పెట్టారు.

మొద‌ట పార్టీ వ్య‌వ‌హారాల‌పై దృష్టి పెట్టిన ఆయ‌న‌.. తాజాగా మంత్రుల‌పై కూడా సీరియ‌స్ కావ‌టం మొద‌లైంది. నిన్న జ‌రిగిన మంత్రివ‌ర్గ భేటీ సంద‌ర్భంగా రోడ్ల వ్య‌వ‌హారంలోనూ.. చంద్ర‌న్న‌కానుక విష‌యంలోనూ జోక్యం చేసుకొని ఏదో చెప్ప‌బోతున్న మంత్రి అచ్చెన్నాయుడ్ని నిలువ‌రించి.. సంబంధం లేని అంశాల్లో ఎందుకు ఎంట‌ర్ అవుతున్నారంటూ ఘాటుగా స్పందించ‌టం మారిన బాబులో కొత్త కోణంగా చెప్పొచ్చు.

తాజాగా జంబ్లింగ్ విధానంపై ప్రైవేటు విద్యాసంస్థ‌ల ప్ర‌తినిధులు చంద్ర‌బాబును క‌లిసిన స‌మ‌యంలో.. జంబ్లింగ్ విధానంపై సానుకూలంగా లేని వారిపై ఫైర్ కావ‌టంతో పాటు.. మంచిగా ఉండే జంబ్లింగ్ విధానాన్ని ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారంటూ తీవ్ర స్వ‌రంతో మాట్లాడ‌టంతో ప్రైవేటు విద్యాసంస్థ‌ల అధిప‌తుల‌కు నోట మాట రాని ప‌రిస్థితి.

అదే స‌మ‌యంలో ప్రైవేటు విద్యాల‌యాల్లో వ‌స‌తులు.. నాణ్య‌త ఏమాత్రం బాగోలేద‌న్న మాట‌తో పాటు.. త‌న మంత్రివ‌ర్గంలోని మంత్రి.. బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా పేరొందిన నారాయ‌ణ‌కు చెందిన క‌ళాశాల‌ల విష‌యాన్ని ప్ర‌స్తావించార‌న్న మాట వినిపిస్తోంది. నిన్న‌టి నిన్న రాజ‌ధాని రైతుల‌కు విష‌యంలో బాబు ఫైర్ కావ‌టం తెలిసిందే. ఆ మ‌ధ్య ఉద్యోగుల విష‌యంలోనూ ఆయ‌న క‌న్నెర్ర చేస్తున్నారు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే.. బాబు తీరులో మార్పు స్ప‌ష్టంగా వ‌చ్చింద‌ని చెప్పొచ్చు. ఎందుకిలా అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం వినిపిస్తోంది.

ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి 20 నెల‌లు దాటుతున్నా.. ఎలాంటి మార్పు తీసుకురాలేక‌పోవ‌టం.. అనుకున్న ప‌నుల్ని పూర్తి చేసే విష‌యంలో వేగం లోపించ‌టం.. ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తి.. పాల‌న‌లో త‌న మార్క్ చూపించ‌లేక‌పోవ‌టం క‌లిసి బాబు పేరు ప్ర‌ఖ్యాతుల్ని ప్ర‌భావితం చేస్తున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే.. బాబు ఫైరింగ్ కు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. కేవలం మాట‌ల ఫైరింగ్ తోనే బాబు వ‌దిలేస్తారా? లేక‌.. పార్టీ.. ప్ర‌భుత్వ ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News