రాహుల్ తో బాబు భేటీ వెనుక అస‌లు కార‌ణం అదేనా?

Update: 2018-11-01 07:30 GMT
తెలుగుదేశం పార్టీ అన్న వెంట‌నే తెలుగువారికి గుర్తుకు వ‌చ్చేది.. కాంగ్రెస్ మీద ఆ పార్టీకి ఉన్న వ్య‌తిరేక‌త‌. ఆ పార్టీతో ఉండే శ‌త్రుత్వం. పుట్టుక‌తోనే కాంగ్రెస్ వ్య‌తిరేక పార్టీగా టీడీపీ ప్ర‌యాణం మొద‌లైంది. అది అంత‌కంత‌కూ పెరిగిందే త‌ప్పించి త‌గ్గ‌లేదు. రాజ‌కీయ‌ శ‌త్రుత్వం కాస్తా వ్య‌క్తిగ‌తం వ‌ర‌కూ వెళ్లింది. అవ‌స‌రాలు మ‌నిషిని ఎంత‌కైనా మారుస్తాయి. తాజాగా బాబు ప‌రిస్థితి కూడా అంతే.

మోడీతో త‌న‌కు వ‌ర్క్ వుట్ కాక‌పోవ‌టం.. తాను చేసిన త‌ప్పుల‌తో ఓటుకు నోటు కేసు వెంటాడుతూ.. ఏ రోజు విరుచుకుప‌డుతుందో తెలీని భ‌యాందోళ‌న‌ల మ‌ధ్య ఉన్న బాబుకు.. కాంగ్రెస్ మిన‌హా ఆప‌న్న‌హ‌స్తం అందించే వారెవ‌రూ లేరు. మ‌రోవైపు కాంగ్రెస్ సైతం దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది.

మోడీ లాంటి శ‌క్తివంతుడ్ని ఎదుర్కోవ‌టం రాహుల్ లాంటి బ‌క్క‌జీవికి సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. పార్టీల‌కు.. రాజ‌కీయ శ‌త్రుత్వాల‌కు అతీతంగా అడుగులు వేస్తే త‌ప్పించి మోడీని ఢీ కొట్ట‌టం సాధ్యం కాదు. ఇలా కాంగ్రెస్‌కు.. అదే స‌మ‌యంలో బాబుకు ఒకే అవ‌స‌రం వేర్వేరుగా ఉండ‌టం.. ఇద్ద‌రూ క‌లిస్తే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్న ఉద్దేశ‌మే తాజా క‌ల‌యిక‌కు కార‌ణంగా చెప్పాలి.

నిజానికి బాబు బ్యాక్ గ్రౌండ్ కాంగ్రెస్సేన‌న్న‌ది మ‌ర‌చిపోకూడ‌దు. పిల్ల‌నిచ్చిన మామ టీడీపీ పేరుతో కొత్త పార్టీ స్టార్ట్ చేసినా.. ఆయ‌న కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ మాట‌కు వ‌స్తే మామ ఎన్టీఆర్‌ పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన ఘ‌న చ‌రిత్ర బాబుసొంతం. త‌ర్వాతి కాలంలో తాను కాంగ్రెస్ లో ఉంటే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని గుర్తించి.. మామ‌తో సంధి కుదుర్చుకొని టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. అలా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన బాబు.. త‌న హ‌యాంలోనే మ‌ళ్లీ టీడీపీని కాంగ్రెస్ ద‌గ్గ‌ర చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ అధికారికంగా కాంగ్రెస్ అధినేత‌తో బాబు భేటీ కాలేదు. అన‌ధికారికంగా.. తెర వెనుక ఇప్ప‌టికే కొన్ని భేటీలు పూర్తి అయ్యాయి. ఇలా ఎవ‌రికి తెలీకుండా.. ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా ర‌హ‌స్యంగా భేటీ కావ‌టంలో బాబు ఎక్స్ ప‌ర్ట్ అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఆ మ‌ధ్య‌లో త‌న‌కున్న కేసు ముప్పు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వీలుగా చిదంబ‌రం మాష్టారితో రాత్రి వేళ‌లో క‌లిశార‌న్న ఆరోప‌ణ మా జోరుగా రావ‌టం తెలిసిందే.

ఆ విష‌యాన్ని క‌ట్ చేస్తే.. తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ తో అంత అర్జెంట్ గా ఎందుకు భేటీ అవుతున్నార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ తో జ‌త క‌ట్టిన బాబు కార‌ణంగా కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. కూట‌మి కార‌ణంగా త‌మ అధికారం చేజారుతుంద‌న్న సందేహం ఆయ‌న‌లో ఉంది. త‌న‌ను ఇరుకున పెడుతున్న బాబుకు త‌న‌దైన రీతిలో స‌మాధానం చెప్పాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో బాబుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌ధాని మోడీ సైతం  ఏపీ ముఖ్య‌మంత్రిని ఏ విధంగా ఫిక్స్ చేయాల‌న్న ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే బాబు బ్యాచ్ ప‌లువురిపై ప‌లు శాఖ‌లు రంగంలోకి దిగి త‌నిఖీల దాడులు చేసిన వైనం తెలిసిందే.

బాబుకు స‌న్నిహితంగా ఉన్న నేత‌ల‌పై త‌నిఖీలు చేసిన వివిధ విభాగాలు.. బాబుపై తాజాగా ఫోక‌స్ చేసిన‌ట్లుగా   చెబుతున్నారు. దీనికి సంబంధించిన స‌మాచారం ఇప్ప‌టికే బాబుకు చేరింది. తెలంగాణ‌లో త‌న‌కు ఇబ్బందిగా మారిన బాబుకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ కు మోడీ తోడు కావ‌టం.. బాబుకు క‌రెంట్ షాక్ ఇచ్చే ఓటుకు నోటు కేసును తెర మీద‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్ప‌టికే కొంత క‌స‌ర‌త్తు జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌పై న‌మోద‌య్యే కేసుల‌న్నీ రాజ‌కీయ క‌క్ష‌తోనే అన్న క‌ల‌ర్ ఇచ్చేందుకు వీలుగా గ్రౌండ్ ను సిద్ధం చేయాల్సిన అవ‌స‌రం బాబు మీద ప‌డింది. అందులో భాగంగానే రాహుల్ తో భేటీ కావ‌ట‌మే కాదు.. బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ప‌లు పార్టీల‌ను ఒక గొడుగు కింద తీసుకురావ‌టం ద్వారా.. బీజేపీ జోరుకు.. మోడీ ఎత్తుల‌కు చెక్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే.. ఆయ‌న్ను అర్జెంట్ గా రాహుల్ తో భేటీ అయ్యేలా చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News