కేసీఆర్ అత్యంత చురుకుగా మారడానికి కారణం అదేనట?

Update: 2022-12-02 09:02 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన చర్యలు ఊహాతీతం అంటారు. ఆయన వేసే ఎత్తులు పక్కనున్న వారికి కూడా తెలియదు. అంతలా ప్రత్యర్థులను చిత్తు చేస్తుంటారు. తాజాగా హఠాత్తుగా అధికార టీఆర్ఎస్ హైపర్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్లిపోయింది.

ఇలా మార్చింది మరెవరో కాదు, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించేందుకు ఆయన, ఇతర మంత్రులు ముమ్మరంగా సమీక్షా సమావేశాలను ప్రారంభించారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను కోరినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 4న మహబూబ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

డిసెంబర్ 7న జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. డిసెంబర్ 9న రాయదుర్గం-శంషాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ఆయన ప్రారంభిస్తారు. డిసెంబర్ 11న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించే అవకాశం ఉంది.

కాగా  రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తున్నారు. వచ్చే నెలలో ఆయన కొత్తగా నిర్మించిన రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. టీఆర్ఎస్ వర్గాల నుంచి  అందుతున్న సమాచారం ప్రకారం, రహదారి మరమ్మతు పనులు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు కూడా వేగవంతం చేయబోతున్నారట..

కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రణాళికలో ఉన్నారనడానికి ఇవన్ని సంకేతాలని అత్యంత కీలకమైన వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉద్దేశంతో తన మంత్రులను వారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పాదయాత్రలు చేపట్టాలని ఆయన కోరారు. ఎన్నికలను ముందుకు తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ పనులు ముందుకు సాగుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News