తుమ్మ‌ల‌పై కేసీఆర్ డెసిష‌న్ ఎందుకు మారింది...!

Update: 2019-07-30 08:54 GMT
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. మరో ఆరు క్యాబినెట్ ప‌ద‌వులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం టిఆర్ ఎస్ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవంగా కేసీఆర్ లోక్‌ స‌భ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ చేయాలని అనుకున్నారు. ఈ ఫలితాలు టీఆర్ ఎస్ అనుకున్నంత‌ అనుకూలంగా రాలేదు. కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్‌ లో బిజెపి అభ్యర్థి ధ‌ర్మపురి అరవింద్‌ చేతిలో ఓడిపోయారు. ఈ ఫ‌లితాల నుంచి కాస్త కోలుకున్న‌ కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు. కుమారుడు కేటీఆర్‌ తో పాటు - మేన‌ళ్లుడు హ‌రీష్‌ రావుకు ఎలాగూ కేబినెట్‌ లో చోటు ఉంటుంది.

ఇక మ‌హిళా కోటాలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఖ‌చ్చితంగా చోటు ఉంటుందంటున్నారు. ఆమె పార్టీలో చేరినప్పుడు తన కుమారుడికి ఎంపీ టిక్కెట్... తనకు మంత్రి పదవి ఇవ్వాలన్న కండీష‌న్‌ తోనే కాంగ్రెస్ నుంచి టిఆర్ ఎస్ లో చేరినట్టు తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా నుంచి ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి త‌ప్ప‌కుండా కేబినెట్ లో ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. గ‌త కేబినెట్‌ లో కేసీఆర్ త‌న జాన్ జిగిరీ దోస్త్ తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు  ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు.

తుమ్మ‌ల పాలేరు ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మ‌ల‌ ఓడిపోవడంతో ఆయనకు రెండోసారి కేబినెట్ లో చోటు దక్కలేదు. కొద్దిరోజులుగా ఓడిపోయిన నేతలకు కేసీఆర్ ప‌ద‌వులు ఇవ్వ‌ర‌న్న ప్రచారం జరిగింది. మ‌రి క‌మ్మ కోటాలో మంత్రి ఎవ‌రు ? అవుతార‌న్న‌ది కూడా ఆస‌క్తిగా మారింది. పువ్వాడ అజ‌య్‌ - ఆరికెపూడి గాంధీ పేర్లు ప్ర‌ధానంగా వినిపించాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లా మొత్తం మ‌హా కూట‌మి హ‌వా సాగింది. జిల్లాలో కేవ‌లం పువ్వాడ అజ‌య్ ఒక్క‌రు మాత్ర‌మే టీఆర్ ఎస్ నుంచి విజ‌యం సాధించారు. స‌హ‌జంగానే ఆయ‌న మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే ఇక్క‌డ కేసీఆర్ లెక్క‌లు వేరేలా ఉన్నాయ్‌. జిల్లా టీఆర్ ఎస్‌ లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. పాలేరులో తుమ్మ‌ల‌పై గెలిచిన ఉపేందర్‌ రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరారు. ఆయనకు తుమ్మ‌ల‌కు స‌ఖ్య‌త లేదు. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తుమ్మ‌ల‌కు పొస‌గ‌దు. ఇటీవ‌ల ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వర రావుకు తుమ్మ‌ల‌కు టిటిడిలో ఉన్నప్పటినుంచే గ్యాప్ ఉంది. తాజా ఎన్నికల్లో నామా విజయానికి తుమ్మల చాలా కష్టపడ్డారు. దీంతో పాటు జిల్లాలో గ్రూపు రాజకీయాల వల్లే తుమ్మల ఓడిపోయారని భావిస్తోన్న కేసీఆర్‌... ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో గ్రూపులు అన్నింటినీ ఒకే తాటి మీదకు తీసుకు రావాలంటే తుమ్మ‌ల‌కే మంత్రి పదవి ఇవ్వటం కరెక్ట్ అని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మళ్ళీ తుమ్మ‌ల‌కే మంత్రి పదవి వ‌స్తుంద‌న్న టాక్‌ టిఆర్ ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే జిల్లాలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న వ‌ర్గం ఆయ‌న‌కు ప‌ద‌వి వ‌ద్ద‌ని చెప్పినా వాళ్ల మాట కేసీఆర్ ఎంత వ‌ర‌కు వింటారు ? అన్న‌ది సందేహ‌మే.


Tags:    

Similar News