విందుకు వెళ్లకపోవటం వ్యూహాత్మకమేనా?

Update: 2015-07-01 04:20 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఆయన కానీ ఒక అడుగు ముందుకు వేసినా.. ఎంతో మధనం ఉంటుంది. పైకి ఆవేశంగా వేసినట్లు కనిపించే అడుగులో రాజకీయ వ్యూహం.. చతురత ఉంటుంది. తాజాగా రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ ఇచ్చిన విందునకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం గైర్హాజరయ్యారు.

అనారోగ్యం కారణంగా కేసీఆర్‌ విందునకు రాలేదని చెబుతున్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్‌ మాత్రం.. తన తండ్రికి ముఖం చూపించలేకనే విందుకు రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

వేసవి నుంచి వర్షాకాలం సీజన్‌ మారిన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్వరం.. జలుబు.. గొంతునొప్పుల కేసులు ఎక్కువగా ఉన్న పరిస్థితి. అలాంటి సమయంలో జ్వరం.. జలుబు అన్నది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఇక.. మంగళవారం ఉదయం నుంచే ముఖ్యమంత్రి తాను పాల్గనాల్సిన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకోవటం కనిపిస్తుంది.

గవర్నర్‌ ఇచ్చిన విందునకు చంద్రబాబు ఎదురుపడతారన్న కారణంగానే తన కార్యక్రమాన్ని రద్దు చేసుకునేందుకు పిరికివ్యక్తి కేసీఆర్‌ కాదనే చెప్పాలి. ఇబ్బందికర పరిస్థితులను తనదైన శైలిలో అధిగమించే కేసీఆర్‌.. విందుకు డుమ్మా కొట్టేందుకు అనారోగ్యం అని అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఉండే అవకాశమే లేదు. ఇక.. ఏపీ సీఎం బాబు కుమారుడు లోకేశ్‌ ఆరోపించినట్లుగా.. నాలుగురోజులు ఫాంహౌస్‌లో ఉన్న వ్యక్తికి ఉన్నట్లుండి జ్వరం రావటమా? అన్న ప్రశ్నలోనూ అర్థం లేదని చెప్పొచ్చు.

జలుబు.. జ్వరం అన్నది చెప్పి వచ్చేవి కావు. అవి ఎప్పుడైనా రావొచ్చు. దాని తీవ్రత ఎంత అన్నది అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది తప్పించి.. చూసే వాడికి తెలియకపోవచ్చు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి మాట్లాడటం అంత సబబుగా ఉండదు. గవర్నర్‌ విందునకు రాకపోవటాన్ని ప్రశ్నించే అవకాశం లోకేశ్‌కు ఉంటే ఉండొచ్చు.. కానీ.. ఆ పేరున జ్వరం ఎందుకు వచ్చిందన్న మాట సబబుగా అనిపించుకోదు.

మరోవైపు.. కేసీఆర్‌ గైర్హాజరీకి మరో కారణాన్ని రాజకీయ వర్గాలు చేస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్‌ విందు కార్యక్రమానికి వస్తే.. చంద్రబాబుతోకలిపి కరచాలనం చేయించే అవకాశం ఉందని.. అది ఇష్టం లేకనే కేసీఆర్‌ హాజరు కాలేదని చెబుతున్నారు. కేసీఆర్‌ మనస్తత్వం ఈ వాదనకు కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. తనకు నచ్చని వ్యక్తుల్ని కలిసేందుకు కేసీఆర్‌ పెద్దగా ఇష్టపడరు. తనను ఏ దశలో చిన్న మాట అన్న దాన్ని కూడా ఆయన చాలా ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు. అందుకు బదులు తీర్చుకోవటానికి ఏ సందర్భాన్ని విడిచి పెట్టరు.

గవర్నర్‌ ఇచ్చే విందుకు హాజరై.. అక్కడ చంద్రబాబు పక్కనే కూర్చొని.. కరచాలనం చేసి..నవ్వుతూ మాట్లాడటం కేసీఆర్‌ లాంటి వ్యక్తికి అస్సలు చేతనైన విషయం కాదు. అందులోకి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ముఖాముఖి పోరాటం జరుగుతున్న నేపథ్యంలో బాబుతో షేక్‌హ్యాండ్‌కు సైతం కేసీఆర్‌కు ఇష్టం ఉండకపోవచ్చు. దీనికి తోడు అనారోగ్యం ఆయనకు కలిసి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. విందుకు వెళ్లటం వ్యూహాత్మకమేనా అనే దాని కంటే కూడా ఆయన మనసుకు తగినట్లే పరిస్థితులు ఏర్పడ్డాయన్న మాట సబబుగా ఉంటుంది.



Tags:    

Similar News