మోడీతో మోహన్ బాబు భేటి.. వెనుక కథేంటి?

Update: 2020-01-07 04:02 GMT
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లను కలిసేందుకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని వార్తలొస్తున్నాయి. అలాంటిది తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబును మాత్రం మోడీ అక్కున చేర్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనివెనుక కథేంటి అన్నది ఆసక్తిగా మారింది.

తాజాగా మోహన్ బాబు కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు.   సుమారు 45 నిమిషాల పాటు మోడీతో  మోహన్ బాబు సమావేశమయ్యారు. మోహన్ బాబుతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మీ, కుమారుడు విష్ణు, కోడలు విరోనికలు మోడీని కలిశారు. బీజేపీలో చేరాల్సిందిగా మోహన్ బాబును మోడీ ఆహ్వానించారని.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

అయితే మోడీతో భేటి తర్వాత మోహన్ బాబు విలేకరులతో మాట్లాడారు. మోడీని కలవడం వెనుక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని.. కేవలం తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థలను సందర్శించాలని మాత్రమే ప్రధానిని కోరినట్లు మోహన్ బాబు తెలిపారు. బీజేపీలోకి ఆహ్వానించారా అనే ప్రశ్నను మోహన్ బాబు దాటవేశారు. నవ్వుతూనే మౌనం దాల్చారు.

మోహన్ బాబు ఫ్యామిలీతో జరిగిన సమావేశంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోహన్ బాబు కుటుంబంతో భేటి కావడం సంతోషమని.. సినిమా ప్రాముఖ్యత, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎలా పెంచవచ్చనే అంశాలపై చర్చించామని ట్విట్టర్ లో మోడీ పేర్కొన్నారు. దీనికి కృతజ్ఞతగా మోహన్ బాబు మోడీని ఉద్దేశించి ‘వాట్ ఏ మ్యాన్ ’ అని ట్వీట్ చేశారు. మొత్తంగా మోహన్ బాబు ఏకంగా ప్రధానితో అంత సఖ్యతతో భేటి కావడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాంగా చర్చనీయాంశమైంది.
 
2019 ఎన్నికల వేళ చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా వైసీపీలో చేరిన మోహన్ బాబుకు జగన్ ప్రభుత్వం ఏ నామినేటెడ్ పోస్టును ఇంత వరకూ ఇవ్వలేదు. దీంతో ఆ ఆవేదనతోనే మోహన్ బాబు ఇలా సడన్ గా వైసీపీ నుంచి దూరం జరిగి మోడీని కలిశాడా? బీజేపీలో చేరబోతున్నాడా? అన్న ప్రచారమూ సాగుతోంది. 
Tags:    

Similar News