ఆ ఇద్దరి అలకలో అసలు రహస్యం వేరుట!

Update: 2017-10-20 10:30 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశానికి రేవంత్ రెడ్డి రావడమే ఒక చిత్రం అయితే.. ఆయనతో తగాదా పెట్టుకుని - పార్టీని నమ్ముకున్న నాయకులే ఇద్దరు అలిగి సమావేశం నుంచి వెళ్లిపోవడం ఇంకా వింత. కాకపోతే.. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయేంతగా నాయకులిద్దరూ అలగడానికి అసలు కారణం ఇంకా వేరే ఉందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

శుక్రవారం నాడు తెదేపా పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దీనికి సహజంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి - తదితరులంతా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వస్తున్న పుకార్లపై మోత్కుపల్లి - అరవింద్ కుమార్ గౌడ్ రేవంత్ ను నిలదీయడం, అసలే దూకుడు ఎక్కువగా ఉండే రేవంత్.. వారికి పుల్లవిరుపు సమాధానాలు చెప్పడం వారు అలకపూని వెళ్లిపోవడం జరిగిపోయాయి.

అయితే ఆ ఇద్దరు నాయకులు అలక వహించడానికి అసలు కారణం రేవంత్ రెచ్చిపోయి మాట్లాడడం కానే కాదని - వేరే ఉన్నదని వినిపిస్తోంది. తెలంగాణ తెలుగుదేశంలో మిగిలి ఉన్న నాయకుల్లో ఒక వర్గానికి తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తు పెట్టుకోవాలనే కోరిక ఉన్నది. ఆ పార్టీలో చేరితే తమ బతుకు అగమ్యగోచరంగా మారుతుందని - అదే తెదేపాలోనే ఉంటూ పొత్తులు పెట్టుకుంటే.. సీటు గ్యారంటీ మరియు కొన్ని లాభాలు ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. అలాంటి జాబితాలో మోత్కుపల్లి నరసింహులు ముందువరుసలోనే ఉంటారు. ఆయన ఇప్పటికే తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు. తెరాసతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే తప్పేముంది అని ఆయన అంటున్నారు. నిజానికి అరవింద్ గౌడ్ తో పాటు మరికొందరు పెద్దలకు కూడా అదే అభిప్రాయం ఉన్నట్లు సమాచారం.

అయితే ఇప్పుడు వారి ఆవేదన ఏంటంటే.. కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా రేవంత్ సృష్టించిన ప్రకంపనల పుణ్యమాని.. గులాబీ పార్టీతో అంటకాగడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడతాయని, వీటిని కూడా చంద్రబాబునాయుడు ఇక పొసగనివ్వడని బాధపడుతున్నారట. రేవంత్ పుణ్యమాని తమ గులాబీ పొత్తు ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడిందని.. ఆయన మీద కినుక వహించి ఉన్నారట. అయితే ఆ సంగతి నేరుగా చెప్పలేరు గనుక... మరో రకం  ప్రశ్నలతో రేవంత్ ను నిలదీసి.. తగాదా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి రేవంత్ చాలా శాస్త్రోక్తంగా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చేదాకా ఆగి, ఆయనతో భేటీ అయిన తర్వాతనే నిర్ణయం బయటకు చెప్పే ఉద్దేశంతో ఉన్నారు. ప్రకటించే సమయానికి తెలంగాణ తెదేపా పతనం ప్రారంభం కావచ్చు. కాకపోతే.. ఎంత త్వరంగా ఆ ప్రహసనం ముగిసి దుకాన్ బంద్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News