ఆంధ్రోళ్లను మోడీ అందుకే లైట్ తీసుకుంటారా?

Update: 2018-07-05 04:41 GMT
ల‌క్ష రూపాయిలు జేబులో పెట్టుకొని వెళుతున్నారు. ఉన్న‌ట్లుండి ఒక‌రొచ్చి ల‌క్ష నాదేనంటే? క‌డుపు మండిపోతుంది. అదెలా అని అడిగేస్తాం?  దాడి చేసి తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తే పోరాడ‌తాం. అవ‌త‌లోడి దోపిడీని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తాం. ఒక‌వేళ దాడి చేసే వ్య‌క్తి బ‌ల‌వంతుడైతే.. త‌న‌ను మోసం చేసిన వ్య‌క్తి దుర్మార్గాన్ని చెప్పి న్యాయం చేయాల‌ని కోర‌తాం. మోసం చేసినోడికి త‌గిన శాస్తి జ‌రిగే వ‌ర‌కూ పోరాడ‌తాం.

మ‌రి.. జేబులో ల‌క్ష కోసం ఇంత చేస్తున్న‌ప్పుడు.. ఆంధ్రోళ్ల భ‌విష్య‌త్తును ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు చొప్పున కొల్ల‌గొడుతూ.. బొమ్మాట ఆడుకుంటుంటే ఆంధ్రోళ్లు ఏం చేస్తున్న‌ట్లు?  విభ‌జ‌న వేళ‌.. భావోద్వేగంతో ఉన్నార‌న్న పేరుతో చేయాల్సిన న్యాయం చేయ‌కుండా కాంగ్రెస్‌ రెండు ముక్క‌లు చేసేసింది. కాంగ్రెస్ గాయాన్ని ఎత్తి చూపిస్తూ.. విభ‌జ‌న న‌ష్టాన్ని పూడుస్తాన‌ని.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌న‌సులకు సాంత్వ‌న క‌లిగేలా చేస్తానంటూ తియ్య‌టి మాట‌లు చెప్పి నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో నాలుక తిప్పేసిన న‌రేంద్ర మోడీ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అప్పుడు సోనియా. . ఇప్పుడు మోడీ.. ఇలా ఇద్ద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఆంధ్రోళ్ల‌ను టార్గెట్ చేసేందుకు ఎందుకు సాహ‌సిస్తున్నారు?  మ‌రే రాష్ట్రానికి త‌గ‌ల‌న‌న్ని ఎదురుదెబ్బ‌లు ఆంధ్రాకే ఎందుకు త‌గులుతున్నాయి?  ఐదు కోట్ల మంది ఆంధ్రుల జీవితాల్నిప్ర‌భావితం చేసేలా నిర్ణ‌యాన్ని అంత సింఫుల్ గా ఎందుకు తీసుకుంటున్నారు?  ఆంధ్రా విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా ఫ‌ర్లేద‌న్న‌ భ‌రోసా వారికి ఎక్క‌డి నుంచి వ‌స్తుంద‌న్న‌ది చూస్తే.. త‌ప్పంతా ఆంధ్రోళ్ల‌దేన‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

తామున్న గ‌డ్డ మీద ప్రేమ కంటే కూడా త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థమే ఎక్కువ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ప్ర‌జ‌లకు.. ప్రాంతానికి జ‌రిగే న‌ష్టాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా.. త‌మ వ్య‌క్తిగ‌త వ్యాపార ప్ర‌యోజ‌నాలు దెబ్బ తిన‌కుండా ఉంటే చాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే నాయ‌క గ‌ణ‌మే ఆంధ్రాకు అస‌లు స‌మ‌స్య‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేత‌లంద‌రిని చూస్తే.. ఎక్కువ‌మంది వ్యాపారులు.. పారిశ్రామిక‌వేత్త‌లే క‌నిపిస్తారు. ఒక వ్యాపారికి త‌న చుట్టూ ఏమైపోతున్నాఫ‌ర్లేదు... కాకుంటే త‌న వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకోవ‌ట‌మే దృష్టి సారిస్తారు. ఇప్పుడు ఏపీ నేత‌ల ప‌రిస్థితి కూడా అలానే ఉంది. కేంద్రం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. నిల‌దీసి.. నిగ్గ‌దీసి.. త‌మ రాష్ట్రానికి జ‌రుగుతున్నా అన్యాయంపై ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర్చాల్సిన బాధ్య‌త‌ను తీసుకుంటారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు అలాంటివేమీ ఆంధ్రాలోనూ.. ఆంధ్రా నాయ‌క‌త్వంలోనూ క‌నిపించ‌దు.

వారినేం చేసినా ప‌ట్టించుకోరు. మ‌హా అయితే.. పేప‌ర్లో నాలుగు రోజులు ఘాటు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తారు.. సోష‌ల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడ‌తారే త‌ప్పించి.. అంత‌కు మించి ఏమీ జ‌ర‌గ‌ద‌న్న భ‌రోసా ఎక్కువ‌ని చెప్పాలి. అదే ఆంధ్రోళ్లంటే అలుస‌య్యేలా చేస్తుంద‌ని చెప్పాలి.

విభ‌జ‌న హామీల అమ‌లుకు సంబంధించి కేంద్రం అడ్డ‌దిడ్డంగా సుప్రీంకు చెబుతూ.. రాత‌పూర్వ‌కంగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌ట‌మే కాదు.. ప్ర‌ధాన‌మంత్రి హోదాలో రాజ్య‌స‌భ‌లో అంద‌రి ముందు ఇచ్చిన హామీని తూచ్ అంటే.. ఈ దేశంలో ఎవ‌రి మాట‌ను న‌మ్మాలి?  ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీ ప్ర‌ధాని మోడీకి ఆంధ్రోళ్లంతా ప‌డ‌దా?  ఏపీ మీద ఆయ‌న ఎందుకంత క‌సిగా ఉన్నారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

త‌మ పార్టీకి అండ‌గా నిల‌వ‌ని ఏపీకి ప్ర‌యోజ‌నం చేయాల‌న్న భావ‌న బీజేపీకి ఉండ‌దు. నిజానికి ఆ పార్టీకే కాదు.. ఏ పార్టీ అయినా ఇదే తీరులో ఆలోచిస్తుంది. ఆ ర‌కంగా చూసిన‌ప్పుడు ఆంధ్రోళ్ల కార‌ణంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అందుకే వారికి ప్ర‌యోజ‌నం క‌లిగేలా ఎలాంటి నిర్ణ‌యం ఉండ‌దు. ఇక్క‌డ ఇంకో కార‌ణం కూడా ఉంద‌ని చెప్పాలి. త‌మ‌కు ఎంత న‌ష్టం వాటిల్లినా లైట్ తీసుకునే గుణం ఆంధ్రోళ్ల‌లో ఎక్కువ‌. ఎవ‌రికి వారు..త‌మ‌కు జ‌రిగే లాభ‌న‌ష్టాల లెక్క‌లు చూసుకోవ‌ట‌మే త‌ప్పించి ఉమ్మ‌డిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌రిగే న‌ష్టాన్ని లైట్ తీసుకుంటారు.

అదే.. మోడీకి అలుసుగా మారింద‌ని చెప్పాలి. ఆంధ్రోళ్ల‌లో ఏ ఒక్క‌రికి అన్యాయం జ‌రిగినా ఊరుకునేది లేద‌ని.. ఉద్య‌మించ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను అర్థ‌మ‌య్యేలా చెప్పే నేత‌లు.. సంస్థ‌లు.. పార్టీలు లేక‌పోవ‌టం కూడా ఏపీకున్న బ‌ల‌హీన‌త‌ల్లో ఒక‌టిగా చెప్పాలి. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల్లో ఇప్ప‌టికి అమ‌లు చేసిన‌వి అర‌కొరే. అమ‌లు చేసిన‌ట్లుగా చెప్పిన వాటి వాస్త‌వ ప‌రిస్థితి చూస్తే.. హామీల అమ‌లు ఎంత దారుణంగా జ‌రిగిందో అర్థ‌మ‌వుతుంది.

హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రాన్ని ఆంధ్రావాళ్లు కోల్పోయినందుకు ప్ర‌తిఫ‌లంగా ఏపీకి ద‌క్కింది ఎంత‌న్న‌ది చూస్తే.. మొత్తం రూ.5వేల కోట్లు దాట‌ని ప‌రిస్థితి. హైద‌రాబాద్ లోని మాదాపూర్ ముక్క ఒక్క‌టి చాలు ల‌క్ష కోట్ల విలువ చేయ‌టానికి. ఈ లెక్క‌న మొత్తం హైద‌రాబాద్ న‌గ‌రం కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాదు. కానీ.. జ‌రిగిన న‌ష్టాన్ని లెక్క‌లేసి చూపించే మేధావులు.. ప్ర‌ముఖులు ఏపీలో క‌నిపించ‌రు. వారికి సైతం త‌మ క‌డుపు చల్ల‌గా ఉందా?  లేదా? అన్న‌దే త‌ప్పించి.. ఏపీకి ఇంత అన్యాయం చేస్తారా? అంటూ గ‌ళం విప్పాల‌న్న ఆలోచ‌న కూడా చేయ‌రు.

విభ‌జ‌న హామీల్ని అమ‌లు చేసిన‌ట్లుగా సుప్రీంలో దాఖ‌లు చేసిన బ‌రితెగింపు అఫిడ‌విట్ లాంటిది తెలంగాణ రాష్ట్రం విష‌యంలో జ‌రిగి ఉంటే.. ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చేవారు. మోడీ నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసేవారు. మిగిలిన ముచ్చ‌ట్లు ఎలా ఉన్నా.. క‌నీసం బంద్ పిలుపు అయినా వ‌చ్చేది. కానీ.. ఏపీలో మాత్రం అలాంటి చైత‌న్యం భూత‌ద్దం వేసినా క‌నిపించ‌దు. ఎంత‌సేప‌టికి నేను త‌ప్ప మేము లేని ఏపీ నేత‌ల గురించి.. అక్క‌డి ప్ర‌జ‌ల గురించి ఢిల్లీలో కూర్చున్న ప్ర‌ధాని మోడీ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంటుంది? ఏం చేసినా పెద్ద‌గా రెస్పాండ్ కాని ప్ర‌జ‌లు.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా పెద్ద‌గా స్పందించ‌ని తీరు మోడీ లాంటి వారికో అవ‌కాశంగా మారుతుంటుంది. అందుకే.. అంత సింఫుల్ గా షాకులిచ్చే నిర్ణ‌యాల్ని తీసేసుకుంటారు. ఏం చేసినా.. ఏమ‌న్నా.. ప‌ట్టించుకోని ఆంధ్రోళ్ల‌కు షాకులు స్వ‌యంకృతాప‌రాధ‌మేన‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News