నిషిత్ మ‌ర‌ణం ఎందుకో కార‌ణం తెలిసింది

Update: 2017-05-16 11:20 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. విన్న‌వారంతా అయ్యో పాపం అనుకునేలా చేసింది ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు విషిత్ మ‌ర‌ణ  వార్త‌. హ‌ద్దులు దాటిన వేగంతో ప్ర‌యాణించిన ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురి కావ‌టం.. ఘ‌ట‌నాస్థ‌లంలోనే నిషిత్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. దాదాపు రూ.2.10 కోట్ల‌కు పైనే  ఖ‌రీదైన కారులో ప్ర‌యాణించినప్ప‌టికీ ప్ర‌మాదంలో ఆయ‌న ప్రాణాలు కోల్పోవ‌టంపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఖ‌రీదైన కార్లు.. అందునా కోట్లాది రూపాయిలు పోసి కొన్న కారులోనూ ప్రాణాల‌కు సేఫ్టీ లేక‌పోవ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

నిషిత్ తో పాటు.. ఆయ‌న స్నేహితుడు రాజా ర‌విచంద్ర సైతం మ‌ర‌ణించ‌టం ప‌లువురిని క‌లిచివేసింది. ఖ‌రీదైన కారు నిషిత్ ను.. అత‌ని స్నేహితుడి ప్రాణాల్ని ఎందుకు కాపాడ‌లేక‌పోయింద‌న్న అంశంపై పోలీసు అధికారుల‌తో పాటు..నిపుణులు కూడా చ‌ర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. నిషిత్ రోడ్డు యాక్సిడెంట్ మీద ఒక జాతీయ మీడియా సంస్థ‌కు చెందిన వెబ్ సైట్లో ఈ ప్ర‌మాదంపై ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావించారు.

విషిత్ కారు మోడ‌ల్ ను.. దానికి ఉన్న ర‌క్ష‌ణ ఏర్పాట్ల గురించి పేర్కొన్న స‌ద‌రు క‌థ‌నంలో.. ప్ర‌మాదంలో నిషిత్ మ‌ర‌ణించ‌టానికి కార‌ణాన్ని వెల్ల‌డించారు. మెర్సిడెజ్ బెంజ్‌ కు సంబంధించిన నిషిత్ కారు జీ63 స్పోర్ట్స్ యుటిలిటీ వాహ‌నం. ఇందులో ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వీలుగా.. చాలానే ఏర్పాట్లు ఉన్నాయి. అయితే.. ఇవ‌న్నీ కూడా కారుకు సంబంధించి నిర్ణీత వేగంలో వెళ్లే వ‌ర‌కే త‌ప్పించి.. మోతాదుకు మించిన వేగంలో ఆ ర‌క్ష‌ణ ఏర్పాట్లు ఏవీ సాయంగా నిల‌వ‌వ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

నిషిత్ ప్ర‌యాణించిన కారు కేవ‌లం ఐదున్న‌ర సెకండ్ల వ్య‌వ‌ధిలోనే వంద కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకునే సామ‌ర్థ్యం స‌ద‌రు కారు సొంతం. ప్ర‌మాదం జ‌రిగిన రోజున ఆయ‌న కారు గంట‌కు 200 కిలోమీట‌ర్ల వేగానికి మించి ప్ర‌యాణిస్తుండ‌టంతోనే ఆయ‌న ప్రాణాల్ని కారు కాపాడ‌లేక‌పోయింద‌న్న‌ది నిపుణుల వాద‌న‌. ఖ‌రీదైన కార్ల‌లో సైతం గంట‌కు 64 కిలోమీట‌ర్ల వేగం దాటితే ప్ర‌మాదంలోకి ప్ర‌యాణం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈకార‌ణంతోనే నిషిత్ కారులో ఉన్న ర‌క్ష‌ణ ఏర్పాట్లు ఏమీ ఆయ‌న్ను కాపాడ‌లేక‌పోయాయాని చెబుతున్నారు. కార్ల ప్ర‌మాణాల్ని తేల్చే  క్రాష్ టెస్టుల్లో సైతం నిర్ణీత వేగంలోనే నిర్వ‌హిస్తారు త‌ప్పించి.. హ‌ద్దులు దాటే వేగంలో ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌ర‌ని చెబుతున్నారు.

 డ్యుయల్ ఫ్రంట్ - సైడ్ అండ్ విండో ఎయిర్ బ్యాగ్స్ - పెల్విస్ బ్యాగ్స్ - యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ - బ్రేక్ అసిస్ట్ - ఈఎస్‌ పి - అడాప్టివ్ బ్రేకింగ్ ఇలా పలు సదుపాయాలతో ఉన్న నిషిత్ కారు.. మోతాదు మించిన వేగం కార‌ణంగా ఆయ‌న ప్రాణాల్ని కాపాడ‌లేక‌పోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News