అసలు నిజం: పీవీ ప్రధాని ఎలా అయ్యారంటే..

Update: 2016-09-28 07:33 GMT
పుస్లకాలు రాసే అలవాటుతో లాభాలెన్నో. మిగిలిన పుస్తకాల మాట ఎలా ఉన్నా.. అత్యున్నత స్థానంలో కీలక భూమిక పోషేంచే వారికి తెలియని విషయాలు అంటూ ఏమీ ఉండవు. ఇలాంటి వారు తమ అనుభవాల్ని.. తాము చూసిన విషయాల్ని పుస్తకాల రూపంలో జాతికి అందించటం ద్వారా.. అసలేం జరిగిందన్న విషయాలు చరిత్రలో రికార్డు కావటంతో.. ఒక పరిణామం చోటు చేసుకోవటానికి ఎన్ని అంశాలు కారణమయ్యాయి అన్న వాస్తవాలు అందరికి తెలిసే వీలు ఉంటుంది. తాజాగా అలాంటి ప్రయత్నమే మరొకటి జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు తాజాగా మరో కొత్త పుస్తకాన్ని రాశారు. 1991: How PV NARSHIMA RAO MADE HISTORY (1991: హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ)  అన్న పేరుతో రానున్న కొత్త పుస్తకం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రధానిగా ఎలా అయ్యారు? ఆయన్ను ప్రధానిగా ఎంపిక చేయటానికి వెనకున్న కారణం ఏమిటి? కాంగ్రెస్ అధినేత్రి తొలి ప్రాధాన్యం పీవీనేనా? ఆయన్నే ఎంపిక చేయటానికి కాంగ్రెస్ అధినాయకత్వం ప్రాతిప‌దిక ఏమిటి? ఎందుకు ఎంపిక చేసిందన్న ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఇక.. పుస్తకంలో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. సోనియాగాంధీ కుటంబ విధేయుల మద్దతు వల్లే శరద్ పవార్ - అర్జున్ సింగ్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నా పీవీనే రేసులో ముందు నిలిచారు. దీనికి కారణం లేకపోలేదు. వారి దృష్టిలో పీవీ ఏం చెప్పినా చేస్తారన్న ఆలోచనతో పాటు.. తాము కోరుకున్నట్లే రబ్బరు స్టాంపులా వ్యవహరిస్తారని అధిష్ఠానం భావించింద‌ట‌. అప్పటి రాజకీయాల్లో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవటం.. వయసు మీద పడిన వృద్ధుడు కావటం లాంటి అంశాలు కూడా కారణం కావొచ్చని సంజయ్ బారు పేర్కొన్నారు. పీవీ ఎంపికకు ముందు కాంగ్రెస్ అధినాయకత్వం మరో ఆలోచన కూడా చేసిందట.

అప్పటికే ఉప రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మను ప్రధానిగా చేయాలని సోనియా అనుకున్నారని.. కాకుంటే తనకు ఆరోగ్యం ఏ మాత్రం సహకరించటం లేదని.. అందుకే తాను ప్రధాని పదవిని చేపట్టలేనని ఆయన చెప్పారట. ఇలాంటి పరిస్థితుల్లో పీవీకి ప్రధానిగా అవకాశం దక్కింది. పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో ఆర్థికమంత్రి ఎంపికకు సంబంధించి చాలానే కసరత్తు జరిగిందని పేర్కొన్నారు.

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీవీ... ఇందిరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన పీసీ అలెగ్జాండర్ పై ఎక్కువగా ఆధారపడ్డారు. ప్రణబ్ ను ఆర్థికమంత్రిగా నియమించాలంటూ ఆయన సన్నిహితులు పీవీ మీద ఒత్తిడి తెచ్చారు. అప్పుడున్న పరిస్థితుల్లో.. ఆర్థికమంత్రిగా ఒక ఆర్థిక నిపుణుడిని నియమించాలని పీవీ నిర్ణయించుకున్నారు. పలువురు పేర్లు పరిశీలించిన తర్వాత అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఐజీ పటేల్ ను ఎంపిక చేయాలని అనుకున్నారు. అయితే.. ఆయన మంత్రి పదవిని చేపట్టటానికి నో చెప్పారు. దీంతో.. మరొకరి పేరు సూచించాల్సిందిగా కోరినప్పుడు అలెగ్జాండర్.. మన్మోహన్ సింగ్‌ పేరును సూచించటం.. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఆయన అయితే బాగుంటుందన్న భావన వ్యక్తం చేయటంతో పీవీ ఆయన్ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

1991 జూన్ 20వ తేదీ అర్థరాత్రి తర్వాత తన విదేశీ పర్యటనను ముగించుకొని మన్మోహన్ తిరిగి వచ్చారు. 21వ తేదీ ఉదయమే  మన్మోహన్ కు అలెగ్జాండర్  ఫోన్ చేశారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు  స్వీకరించాలని పీవీ ఆశిస్తున్నార‌ని పేర్కొన్నారు. విధి నిర్వహణలో.. నిర్ణయాలు తీసుకోవటంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తామని చెప్పటంతో మన్మోహన్ ఓకే అన్నారు.

మన్మోహన్ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన ఆయనపై పీవీ ఎంతో ఆపేక్షతో వ్యవహరించే వారని బారు త‌న‌ పుస్తకంలో పేర్కొనటం గమనార్హం. 1991లో ఒక్కో నెలలో ఒక్కో అధ్యాయం పేరిట ఏం జరిగిందో.. సంజయ్ బారు వెల్లడించటం విశేషంగా చెప్పొచ్చు. పీవీపై వస్తున్న ఈ పుస్తకం మరెన్ని ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తుందో? మరెన్ని తెర వెనుక సంగతుల్ని బయటకు తీసుకొస్తుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News