ఎవరి పాపం..దేవభూమిలో జలప్రళయానికి కారణమేమిటి?

Update: 2021-02-08 15:30 GMT
దేవభూమిగా చెప్పుకునే ఉత్తరాఖండ్ మరోసారి జలవిలయానికి గురైన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ పరిణామం అందరిని ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. వాతావరణ కాలుష్యం మీద నిర్లక్ష్యానికి భవిష్యత్తులో ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని హెచ్చరించినట్లుగా ఉందని చెప్పాలి. తాజా వైపరీత్యాన్ని చూస్తే.. 2013 నాటి వరదల్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.

భారీ మంచు పలక ధౌలి గంగ నదిలో విరిగిపడటంతో నది ఉప్పొంగింది. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టు పేక మేడలా కొట్టుకుపోయింది. దాదాపు 150 మంది వరకుకార్మికులు గల్లంతు అయినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్న మాటవినిపిస్తోంది. ఇంతకూ ఈ ప్రమాదానికి కారణం ఏమిటి? మంచు చరియలు ఎందుకు విరిగిపడ్డాయి? దానికి దారిన తీసిన పరిస్థితులు ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

ఉత్తరాఖండ్ అన్నంతనే గుర్తుకు వచ్చేవి నిలువెత్తు హిమాలయాలు.. హిమనీ నదాలు. అలాంటి నదుల్లో ఒకటి నందాదేవి గ్లేసియర్. భారతదేశంలో కాంచనగంగ తర్వాత అత్యంత ఎత్తైన మంచుపర్వతం ఇది. ఆదివారం ఉదయం ఈ మంచు పర్వతం నుంచి మంచు చరియలు భారీగా విరిగిపగడటంతో గంగానది ఉప నది దౌలి గంగ.. అలకనంద నదులకు నీరు పోటెత్తింది.  మంచుకింద భాగంలో భూకంపం సంభవించటం.. మంచుపొరల్లో కదలికలు.. భారీ వర్షాలు కురిసిన సమయంలో హిమనీ నదాల నుంచి మంచు చరియలు విరిగి పడుతుంటాయన్నది నిపుణుల వాదన.

ఇదంతా ఒక ఎత్తుఅయితే.. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు.. వాయు కాలుష్యం హిమనీ నదాల్ని వేగంగా కరుగుతున్నాయని రెండేళ్ల క్రితం విడుదలైన ఒక అధ్యయనం వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ పాలకులు పట్టించుకున్నది లేదు. దీనికి తోడు..ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించటం కూడా ఇక్కడి పర్యావరణాన్ని దెబ్బ తీస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. 2013లో ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న వరదల సమయంలో దాదాపు 5700 మంది మరణించినట్లుగా అధికారిక లెక్కలు చెబుతుంటే.. అనధికారికంగా చాలామంది గల్లంతు అయినట్లుగా చెబుతారు. ఆ సందర్భంగా రోడ్లు.. బ్రిడ్జిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నాటి వరదల్ని గుర్తుకు వస్తే..నేటికి ఒళ్లు జలదరింపునకు గురి కావటమే కాదు.. భయంతో వణుకుతారు.
Tags:    

Similar News