లాంగ్ మార్చ్ రద్దుకు అసలు కారణం ఇదే

Update: 2020-01-26 16:20 GMT
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయడమే లక్ష్యంగా లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... కొత్తగా తనకు మిత్రపక్షంగా మారిన బీజేపీతో కలిసి నడుస్తానని సంచలన ప్రకటన చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రాజధాని రైతులు సాగిస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఈ మార్చ్ ను నిర్వహిస్తానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెర వెనుక ఏం జరిగిందో తెలియదు గానీ... లాంగ్ మార్చ్ ను రద్దు చేస్తున్నట్లుగా బీజేపీ ప్రకటించింది. ఆ తెర వెనుక ఉన్న కారణం ఏమిటన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ ను ఓవర్ యాక్షన్ తగ్గించాలని బీజేపీ అధిష్ఠానం చెప్పడమే మార్చ్ రద్దుకు కారణమన్న వాదన ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది.

వచ్చే నెల 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు పవన్ రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో దానిని రద్దు చేస్తున్నట్లుగా బీజేపీ ప్రకటించడం నిజంగానే సంచలనమేనని చెప్పాలి. అయినా లాంగ్ మార్చ్ చేస్తానని పవన్ ప్రకటిస్తే.. దానిని రద్దు చేస్తున్నట్లుగా బీజేపీ ఎలా ప్రకటిస్తుంది? నిజమే... లాంగ్ మార్చ్ పై ప్రకటన చేసిన పవనే దానిని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించాల్సి ఉంది. అలా కాకున్నా... జనసేన మిత్రపక్షంగా బీజేపీ సదరు ప్రకటన చేసినా... దానిపై పవన్ స్పందించాలి కదా. అయితే ఇప్పటిదాకా మార్చ్ రద్దు పై పవన్ మాటమాత్రంగా కూడా స్పందించలేదు. దీంతో అసలు మార్చ్ రద్దుకు కారణాలేమిటన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతోనే పవన్ సైలెంట్ కాగా... బీజేపీ నుంచే రద్దు ప్రకటన వచ్చిందట.

అయినా ఇప్పుడు లాంగ్ మార్చ్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా పవన్ ను బీజేపీ నిలదీసిందట. ఇప్పుడిప్పుడే ఇరు పార్టీల మధ్య కొత్తగా పొడిచిన పొత్తుకు ఈ తరహా లాంగ్ మార్చ్ నష్టమేనని కూడా బీజేపీ భావిస్తోందట. ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం పెట్టుకుని ఇప్పుడే లాంగ్ మార్చ్ లు, షార్ట్ మార్చ్ లు అంటూ వెళితే.. కృష్ణా, గుంటూరు జిల్లాల వరకైతే బాగుంటుందేమో గానీ... మిగిలిన రాష్ట్రంలో కూటమికి దెబ్బేనని కూడా బీజేపీ భావించిందట. దీంతోనే ముందూ వెనుకా చూసుకోకుండా... ఏదో లాంగ్ మార్చ్ చేస్తాం... పొడిచేస్తాం..అంటూ సాగితే.. కూటమికే నష్టమని కూడా బీజేపీ ఓ అవగాహనకు వచ్చిందట. దీంతో ఇకనైనా కాస్తంత ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిదని కూడా పవన్ కు కాస్తంత కటువుగానే చెప్పిందట. దీంతో మార్చ్ రద్దుకు తలూపిన పవన్... అదేదో మీరే చెప్పండని బీజేపీకి చెప్పేసి వెళ్లిపోయారట.


Tags:    

Similar News