అయ్యన్న ఎపిసోడ్ లో ఇంత అవసరమా? అందరి నోటా ఇదే ప్రశ్న?

Update: 2022-11-04 05:33 GMT
గురి చూసి కొట్టాలి. దానితో ప్రత్యర్థి గింగిరాలు తిరగాలి. అంతే తప్పించి.. దెబ్బలు కొట్టటం.. వాటి సౌండ్ ఎక్కువ.. దెబ్బ తగిలేది మాత్రం తక్కువన్నట్లుగా సీఎం జగన్ సర్కారు తీరు ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి తీరుతో ఆయనకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు. సమకాలీన రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని వెంటాడి.. వేటాడే గుణాన్ని చాలావరకు రాజకీయ పార్టీలన్నీ నేర్చుకుంటున్నాయి. ఇలాంటి దరిద్రపుగొట్టు కల్చర్ ఇప్పుడు అనివార్యంగా మారింది.

అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో తాము టార్గెట్ చేసిన నేతల కూసాలు కదిలిపోయేలా చర్యలు ఉండాలే తప్పించి.. తుస్ మనిపించే సీమ టపాకాయ మాదిరి వ్యవహరించటం కారణం.. రచ్చ ఎక్కువ.. విషయం తక్కువన్న భావన కలిగేలా చేస్తోంది. అదేదో.. కావాలని కసిగా చేస్తున్న పనిగా వేలెత్తి చూపించుకోవటం ఎక్కువ అవుతోంది. ఏపీలోనిజగన్ సర్కారు ఇప్పడు ఇలాంటి ఫీలింగ్ నే ప్రజలకు కలిగిస్తుందా? అంటే.. అవునన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇందుకు మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్టు విషయంలోనూ ఇలాంటి పులిహోర వ్యవహారమే కనిపించిందని చెబుతున్నారు.

అయ్యన్న.. ఆయన కుమారుడికి చెందిన 26 సెంట్ల స్థలంలో 2 సెంట్ల (96 గజాలు) స్థలం జలవనరుల శాఖకు చెందినదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన కేసుపై గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా ఈ ఇష్యూ మీదనే ఏపీ సీఐడీ కేసు నమోదు చేయటం.. కేసు నమోదు చేసిన రోజు.. ఆయన్ను.. ఆయన కుమారుడ్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసి.. అరెస్టు చేయటం కలకలాన్ని రేపటంతో పాటు.. ఇది కచ్ఛితంగా రాజకీయ ప్రతీకార చర్యగా చిన్న పిల్లాడికి సైతం అర్థమయ్యేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.

అయ్యన్న.. ఆయన కుమారుడు నర్సీపట్నంలోని రెండు సెంట్ల ప్రభుత్వ భూమిలో ప్రహరీగోడ నిర్మించారన్న ఆరోపణపై..జలవనరుల శాఖకు చెందిన భూమి లేదంటూ ఆ డిపార్టు మెంట్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ వోసీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే.. ఈ ఎన్ వోసీని తాను ఇవ్వలేదంటూ ఇ.ఇ. మల్లికార్జున్ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ పత్రం నకిలీదని.. దాన్ని ఫోర్జరీ చేశారన్నది సారాంశం.

దీనిపై విచారణ చేపట్టాలని సీఐడీ అధికారులు పెద్దిరాజు అనే ఇన్ స్పెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. దానిపై విచారణ చేసిన సదరు అధికారి.. మల్లికార్జున్ ఇచ్చిన కంప్లైంట్ సరైనదేనని.. దాని ఆధారంగా కేసు కట్టవచచని అక్టోబరు 2న నివేదిక ఇచ్చారు. దీంతో ఆ రోజు ఉదయం 10 గంటలకు కేసు నమోదు చేశారు. కేసు కట్టే వేళలో.. పదేళ్లు జైలుశిక్ష పడే సెక్షన్ 467తోపాటు మరికొన్ని సెక్షన్లను అందులో చేర్చారు. కొన్ని గంటల వ్యవధిలోనే మిగిలిన పనులు పూర్తి చేసి మూడో తారీఖు తెల్లవారుజామున  200 మంది పోలీసుల్ని బందోబస్తుగా తీసుకెళ్లి... అయ్యన్న ఇంటి చుట్టూ మొహరించి.. గాఢ నిద్రలో ఉన్న ఆయన్ను లేపి మరీ అరెస్టు చేశారు.

ఇలాంటి చర్యలు రాజకీయ ప్రతీకార చర్యలుగా కనిపిస్తాయి. ఇలాంటి వాటితో జరగాల్సింది జరిగే కన్నా.. జరగకూడనివి జరిగి.. ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. కొందరు అధికారుల అత్యుత్సాహం.. సరైన హోంవర్కు లేకుండా చేసిన ఈ వైనం అయ్యన్న మీద అంతులేని సానుభూతిని తీసుకొస్తే.. జగన్ సర్కారు మీద అందుకు భిన్నమైన ఇమేజ్ వచ్చేలా చేసిందంటున్నారు. మరి.. ఈ విషయాల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News