హైఅలెర్ట్: దేశంలోకి ఉగ్ర‌వాదులు వ‌చ్చేశారు

Update: 2017-01-25 10:28 GMT
జ‌న‌వ‌రి 26.. ఆగ‌స్టు 15 దగ్గ‌ర‌కు వస్తుంటే భ‌ద్ర‌తా వ‌ర్గాలుముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేయ‌టం.. హైఅలెర్ట్ లు ప్ర‌క‌టించ‌టం మామూలే.  దేశానికి కీల‌క‌మైన రోజుల్లో ఉగ్ర‌వాదులు దాడులు జ‌ర‌ప‌టం ద్వారా.. త‌మ ప‌ట్టును ప్ర‌పంచానికి తెలిసేలా చేయాల‌నుకోవ‌టం స‌హ‌జం. అలాంటి వాటికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా నిఘా వ‌ర్గాలు పెద్ద ఎత్తున జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటాయి.

అయితే.. రేపు జ‌ర‌గ‌నున్న రిప‌బ్లిక్ డే దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఉగ్ర‌వాదులు భారీ విధ్వంస ర‌చ‌న సృష్టిస్తున్న‌ట్లుగా ఇప్ప‌టికే మీడియాలో ప్ర‌ముఖంగా వార్త‌లు వ‌చ్చాయి. పెంపుడు జంతువుల‌తో పెద్ద ఎత్తున విధ్వంసం చేసేందుకు ప్లాన్లు వేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా నిఘా వ‌ర్గాలు తీవ్ర హెచ్చ‌రిక జారీ చేశారు. ఆఫ్టాన్ పాస్ పోర్ట్ తో పాక్ ఉగ్ర‌వాదులు దేశంలోకి చొర‌బ‌డిన‌ట్లుగా నిఘా వ‌ర్గాలు గుర్తించిన‌ట్లుగా వెల్ల‌డించారు.

ఈ విష‌యాన్ని ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్ల‌డిస్తూ.. దేశ‌వ్యాప్తంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో.. అంద‌రూ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డే ప‌రిస్థితి. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా భారీ ఎత్తున విరుచుకుప‌డే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఢిల్లీ పోలీసులు త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేశారు. అదే స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను మ‌రోసారి క‌ట్టుదిట్టం చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News