పిల్లను ఇవ్వటం లేదని..పోలీసు ఉద్యోగానికి రాజీనామా?

Update: 2019-09-12 06:38 GMT
ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆవేదన సంచలనంగానే కాదు.. వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపింది. ఆవేదనతో ఉన్నతాధికారులకు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. పలువురిని కొత్త ఆలోచనల్లో పడేసేలా చేసింది. జరిగిందేమంటే..?

చార్మినార్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు సిద్దాంతి ప్రతాప్. అతను బ్యాచిలర్. పెళ్లి చేసుకునేందుకు సంబంధాలు చూస్తున్నాడు. పిల్లను ఇవ్వటానికి సిద్ధమైనప్పటికీ.. ఏం చేస్తున్నావంటే.. పోలీస్ కానిస్టేబుల్ అన్నంతనే పిల్లను ఇవ్వనని తేల్చి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే.. తనకీ ఉద్యోగం వద్దని రాజీనామా చేసి.. ఆ లేఖను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ కు పంపారు.

పోలీసులంటే అమ్మాయిలు ఇష్టపడటం లేదని.. దీంతో చాలా సంబంధాలు కుదర్లేదన్నాడు. ఇటీవల పెళ్లి చూపులకు వెళితే.. ఏం చేస్తుంటారని అమ్మాయి తరఫు వారు అడిగారని.. కానిస్టేబుల్ అన్నంతనే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. కానిస్టేబుల్ ఉద్యోగమంటే 24గంటలు పని ఉంటుందని.. అందుకే పోలీసు సంబందాన్ని ఆమె ఒప్పుకోలేదన్నారు. పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు.. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నాడు.

ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసు ఉద్యోగంలో కానిస్టేబుల్ జీవితం మొత్తం అలానే ఉండాలని.. మహా అయితే ఏఎస్సై వరకూ ప్రమోషన్ ఉంటుందే తప్పించి.. అంతకు మించి ఎదిగే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో ఎస్ ఐ ప్రతి రెండేళ్లకోమారు పనితీరులో భాగంగా ఇచ్చే ప్రమోషన్లతో ఉన్నత స్థానానికి ఎదిగే వీలుందని.. కానీ ఎంత కష్టపడినా కానిస్టేబుల్ కు మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు.

కానిస్టేబుల్ పెళ్లి సంగతేమో కానీ.. తాజా ఉదంతంతో కిందిస్థాయి పోలీసులకు ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగి విన్నపాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంగీకరిస్తారా?  కౌన్సెలింగ్ చేసి మనసు మారుస్తారా? అన్నది చూడాలి.
Tags:    

Similar News