మొబైల్ త‌యారీదారుల‌కు జియో దెబ్బ ఇదే!

Update: 2017-07-06 10:59 GMT
జియో పేరిట దేశీయ మొబైల్ సేవ‌ల రంగంలోకి అడుగుపెట్టిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌... ఈ రంగంలోని ఇతర కంపెనీల‌కు భారీ షాక్‌నే ఇచ్చేసింది. అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్‌, డేటా కాల్స్ పేరిట రిల‌య‌న్స్ గుప్పించిన ప్ర‌క‌ట‌న‌ల‌కు ఇత‌ర కంపెనీల‌న్నీ దాదాపుగా ఒణికిపోయాయ‌నే చెప్పాలి. జియో దెబ్బ‌కు కాల్ రేట్ల‌ను త‌గ్గించ‌డ‌మో, లేదంటే... కొంత‌మేర చార్జీలు వ‌సూలు చేస్తూ అన్ లిమిటెడ్ కాల్స్ అంటూ స‌రికొత్త ప్లాన్ల‌ను ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఆయా కంపెనీల‌కు ఎదురైంద‌ని చెప్పాలి. జియో ఎంట్రీతో దేశీయ మొబైల్ సేవ‌ల రూపురేఖ‌లే దాదాపుగా మారిపోయాయ‌నే చెప్పాలి.

ఇదంతా నిన్న‌టిదాకా మ‌న‌కు కనిపించిన ప‌రిస్థితి. దేశంలోని మొబైల్ సేవ‌ల రంగాన్ని పూర్తిగా త‌న హ‌స్త‌గ‌తం చేసుకునే క్ర‌మంలోనే రిల‌యన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించార‌ని మార్కెట్ విశ్లేష‌కుల వాద‌న‌. అయితే ఈ విమ‌ర్శ‌ల‌ను ఎంత‌మాత్రం ప‌ట్టించుకోని ముఖేశ్... జియో ఫ్రీ ప్లాన్ల‌ను ఇప్ప‌టికే రెండు ప‌ర్యాయాలు పొడిగించారు. ఇక అక్క‌డ ప‌ని అయిపోయింద‌నుకున్నారో... ఏమో తెలియ‌దు గానీ... ఇప్పుడు మొబైల్ హ్యాండ్ సెట్ త‌యారీదారుల‌పై ఆయ‌న దృష్టి సారించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

రిల‌య‌న్స్ కంపెనీ నుంచి దీనికి సంబంధించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న అయితే రాలేదు గానీ... కొన్ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు జియో క‌నెక్ష‌న్‌తో పాటు ఇక‌పై 4జీ స్మార్ట్ ఫోన్ ను కూడా అతి త‌క్కువ ధ‌ర‌కే అందించేందుకు ముఖేశ్ రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ఖ‌రీదు ఎంతలేద‌న్నా క‌నీసం రూ.3 వేలు ఉంటుంద‌ని అంతా భావించారు. అయితే అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ... కేవ‌లం రూ.500కే స‌ద‌రు ఫోన్‌ను అందించించేందుకు ముఖేశ్ రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తాజా వార్త‌లు చెబుతున్నాయి. ఈ నెల 21న ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగే రిల‌యన్స్ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ముఖేశ్ దీనిపై ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తార‌ని భావిస్తున్నారు.

ఇదే జ‌రిగితే... ఇప్ప‌టికే మొబైల్ సేవ‌ల రంగం దాదాపుగా జియో చేతిలోకి వెళ్లిపోతుండ‌గా,  తాజాగా ఈ కొత్త ప‌థ‌కంతో మొబైల్ హ్యాండ్ సెట్ త‌యారీ రంగం కూడా రిల‌య‌న్స్ చేతిలోకే వెళ్లిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే... రూ.500ల‌కే 4జీ స్మార్ట్ ఫోన్‌ ను అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్న రిల‌య‌న్స్‌... రూ.3 వేల‌కే 4జీ టెక్నాల‌జీతో ప‌నిచేసే ల్యాప్ టాప్‌ ను కూడా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ల్యాప్‌ టాప్‌ లో సిమ్ కార్డు వేసుకుని ఉప‌యోగించుకునే వెసులుబాటు కూడా ఉంటుందని కూడా తెలుస్తోంది. చూద్దాం మ‌రి ఈ నెల 21న ముఖేశ్ అంబానీ ఏ త‌ర‌హా ప్ర‌క‌ట‌న చేస్తారో?
Tags:    

Similar News