12 మంది మంత్రుల తొలగింపు.. మొత్తం వారిపై నెట్టేశారా?

Update: 2021-07-09 01:30 GMT
ప్రధాని నరేంద్ర మోడీ.. తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. విస్తరణ తర్వాత మొత్తం 78 మందితో భారీ కేబినెట్ కొలువుదీరింది. అయితే.. కొత్తవారికి పలు కారణాలతో పదవులు ఇచ్చి ఉండొచ్చు. అయితే.. పాతవారిని ఏకంగా 12 మందికి ఉద్వాస‌న ప‌లికారు. ఇందులో.. ఎవ్వ‌రూ ఊహించ‌ని మంత్రులు కూడా ఉండ‌డం దేశ‌రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐటీ, న్యాయ‌ శాఖ‌ల బాధ్య‌త‌లు చూసిన‌ ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌, ప్ర‌సార‌, స‌మాచార మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్, వైద్య‌శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్‌ కూడా మంత్రిప‌ద‌వి కోల్పోవ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. దీంతో వీరిని ఏ కార‌ణం చేత తొల‌గించారు? అనే చ‌ర్చ సాగుతోంది.

అయితే.. ఈ మంత్రులు త‌మ బాధ్య‌త‌లు స‌రిగా నిర్వ‌ర్తించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఉద్వాస‌న ప‌లికార‌ని అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు. కానీ.. అస‌లు విష‌యం మాత్రం వేరే ఉంద‌ని అంటున్నారు. ఈ మేర‌కు సోస‌ల్ మీడియాలో గ‌ట్టిగానే ట్రోలింగ్ న‌డుస్తోంది. సెకండ్ వేవ్ క‌రోనాతో దేశం ఎంత‌గా న‌ష్ట‌పోయిందో తెలిసిందే. గ‌రిష్టంగా ఒక రోజు కేసులు 4 ల‌క్ష‌లు కేసులు న‌మోదైతే.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప‌రిస్థితి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. చివ‌ర‌కు న్యాయ‌స్థానాలు సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ట్టించుకోకుండా.. ఎన్నిక‌లు ముఖ్య‌మ‌య్యాయంటూ జ‌నం దుమ్మెత్తిపోశారు. చివ‌ర‌కు అంత‌ర్జాతీయ మీడియా సైతం ఏకిపారేసింది.

దీంతో.. న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా విమ‌ర్శ‌ల పాల‌య్యారు. బీజేపీ స‌ర్కారు అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంది. మోడీ ఇమేజ్ త‌గ్గిపోతోంద‌నే చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా జ‌రిగింది. దీంతో.. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన అధిష్టానం.. ఈ విధంగా వ్య‌వ‌హ‌రించింద‌ని అంటున్నారు. మోడీ, అమిత్షా మీద వెల్లువెత్తిన వ్య‌తిరేక‌త‌ను ఆయా శాఖ‌ల మంత్రుల మీద చూపించార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. క‌రోనా నియంత్ర‌ణ స‌రిగా చేయ‌లేక‌పోయార‌నే సాకుతో.. కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ను బ‌లిచేశార‌నే చర్చ సాగుతోంది.

ఇక‌, ట్విట‌ర్ వివాదాన్ని స‌రిగా డీల్ చేయ‌లేదంటూ ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ను ప‌క్క‌న‌పెట్టిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన కొత్త నిబంధ‌న‌లు అమ‌లు చేసేందుకు సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్ అంగీక‌రించ‌క‌పోవ‌డం.. వివాదం ముద‌ర‌డం వంటివి జ‌రిగిపోయాయి. దీంతో.. అంత‌ర్జాతీయంగా చ‌ర్చ జ‌రిగింది. భార‌త్ లో మీడియాను నియంత్రిస్తున్నార‌ని, అణ‌చివేస్తున్నార‌నే అభిప్రాయం ఇత‌ర దేశాల‌కు క‌లిగింద‌నే ప్ర‌చారం కూడా సాగింది. దీంతో.. ఈ విష‌యాన్ని స‌రిగా చ‌క్క‌బెట్ట‌లేక‌పోవ‌డంతో.. ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు.

మ‌రో మినిస్ట‌ర్ ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ను కూడా ప‌క్క‌న పెట్టారు. వాస్త‌వానికి వీరంతా కొన‌సాగుతార‌నే అంద‌రూ భావించారు. ఈయ‌న్ను సామాజిక వ‌ర్గాల వారీగా ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. మ‌హారాష్ట్ర నుంచి చాలా మంది మంత్రులు ఉన్నారు. దీంతో.. ఈయ‌న‌కు చోటు ద‌క్క‌లేద‌ని చెబుతున్నారు. వీరేకాదు.. బెంగాల్ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు.. బాబుల్ సుప్రియో, దేబ‌శ్రీ చౌదురిని కూడా ఇంటికి పంపేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వీరు స‌రిగా ప్ర‌భావం చూప‌లేద‌నే సాకుతోనే వీరిని ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

న‌రేంద్ర మోడీ - అమిత్ షా జోడీ మీద వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు, ఇత‌రుల మీద‌కు ఇలా నెట్టేశార‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో సాగుతోంది. వీరిని మంత్రి ప‌ద‌వుల నుంచి తొల‌గించ‌డం ద్వారా.. వారిని బాధ్యుల‌ను చేస్తూ.. వీరిద్ద‌రూ చేతులు దులుపుకున్నార‌ని అంటున్నారు. ఇప్పుడు చ‌ర్చ మొత్తం తొల‌గించిన మంత్రుల మీద‌నే ఉంటుంద‌ని, త‌ద్వారా.. ప్ర‌ధాని, హో మంత్రిపై ఫోక‌స్ త‌గ్గిపోతుంద‌ని, ఇందుకోస‌మే ఇలాంటి అసాధార‌ణ నిర్ణ‌యాల‌ను కూడా తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News