బాబు పాల‌న చూసిన రేణుదేశాయ్ కంట క‌న్నీరు

Update: 2019-02-26 04:59 GMT
సోష‌ల్ మీడియాలో పోస్టుల‌తో త‌ర‌చూ హాట్ టాపిక్ గా మారుతూ ఉండే సినీ న‌టి క‌మ్ సామాజిక వేత్త క‌మ్ ప‌వ‌న్ మాజీ భార్య ట్యాగ్ ఉన్న రేణు దేశాయ్. తాజాగా ఆమె ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో ఉన్నారు. రేణు ఏంటి?  క‌ర్నూలు జిల్లాలో ఉండ‌టం ఏమిటి? అన్న డౌట్ అక్క‌ర్లేదు. ఒక ప్ర‌ముఖ తెలుగు టీవీ న్యూస్ ఛాన‌ల్ కు సంబంధించిన ఒక కార్య‌క్ర‌మాన్ని ఆమె నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆమె ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ.. అక్క‌డి ప‌రిస్థితుల్ని.. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని.. అల‌క్ష్యాన్ని ప్ర‌శ్నించ‌టం.. నిజం ఇదేనంటూ ప్ర‌పంచానికి చాటి చెప్ప‌టం ఈ కార్య‌క్ర‌మ ల‌క్ష్యం.ఇందులో భాగంగా క‌ర‌వుతో  త‌ల్ల‌డిల్లుతున్న రైతుల క‌ష్టాలు.. అప్పుల బాధ తాళ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న  అన్న‌దాత‌ల ఫ్యామిలీల‌ను ఆమె క‌లుస్తున్నారు.

తాజాగా క‌ర్నూలు జిల్లా ఆలూరు మండ‌లం తుంబ‌ల‌బీడు మండ‌ల కేంద్ర‌మైన పెద్ద క‌డ‌బూరులో ప‌ర్య‌టించారు. అప్పుల బాధ తాళ‌లేక గ‌త ఆగ‌స్టులో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు దంప‌తుల (నెర‌ణికి బోయ‌రామ‌య్య‌.. వండ్ర‌మ్మ‌) కుటుంబాన్ని క‌లిశారు. వారితో మాట్లాడారు. వారి వెత‌లు విని కంట‌త‌డి పెట్టారు. ఆ గ్రామంలో ర‌చ్చ‌బండ‌పై రైతుల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా వారు త‌మ‌కున్న స‌మ‌స్య‌ల చిట్టాను విప్పారు. ప‌క్కా ఇళ్లు లేవ‌ని.. తాగునీటి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. రోడ్లు బాగోలేద‌ని.. జింక‌ల బెడ‌ద త‌మ‌కు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వాపోయారు. పంట‌ల కోసం చేసిన అప్పుల్ని తిరిగి చెల్లించ‌లేక‌పోతున్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు హ‌యాంలో క‌రవుతో త‌ల్ల‌డిల్లుతున్న‌ట్లు చెప్పుకొచ‌చారు. తాము పండించిన ప‌త్తి.. మిర్చికి స‌రైన ధ‌ర‌లు ప‌ల‌క‌టం లేద‌న్నారు. రేణు దేశాయ్ స్వ‌యంగా రావ‌టంతో.. త‌మ క‌ష్టాల చిట్టా విప్పి.. సాయం చేయాల‌ని కోరారు.

దీనికి స్పందించిన ఆమె.. తాను ప్ర‌జాప్ర‌తినిధిని కాన‌ని.. ప్ర‌భుత్వ అధికారిని కూడా కాన‌ని.. అయిన‌ప్ప‌టికీ మీ క‌ష్టాల్ని ప్ర‌భుత్వ దృష్టికి..అధికారుల దృష్టికి తీసుకెళ‌తాన‌న్న హామీ ఇచ్చారు. రేణు దేశాయ్ స్వ‌యంగా రావ‌టం అక్క‌డి వారిలో హాట్ టాపిక్ గా మారింది. వారి క‌ష్టాలు వినే క్ర‌మంలో ఆమె క‌న్నీళ్లు పెట్టటం చూసిన‌ప్పుడు ఏపీలో ఇంత దారుణ‌మైన ప‌రిస్థితులు ఉన్నాయా? అన్న‌ది చ‌ర్చ‌గా మారింది.
Tags:    

Similar News