మద్యం షాపుల్లో రిజర్వేషన్లు.. బడుగులకు ఏం దక్కుతాయ్ కేసీఆర్ సార్?

Update: 2021-09-17 07:30 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న ఓ నిర్ణయాన్ని ప్రభుత్వ వర్గాలు ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా కూడా అవి సగటు లబ్ధిదారులకు అందుతాయా? లేదా? అన్న చర్చసాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిన్న రాత్రి ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అందులో ముఖ్యమైనది మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం. ఇదే ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యందుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు ప్రకటించారు.

ఇటీవల దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పథకంలో భాగంగా రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్టు సీఎం తెలిపారు. అప్పుడు ఎస్సీ, ఎస్టీల్లో పేదలకు ఈ పథకం లబ్ధి చేకూరింది.

అయితే తాజాగా మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చినా సగటు పేద గౌడ, ఎస్సీ, ఎస్టీలకు ఏమాత్రం ఉపయోగం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మద్యంషాపుల టెండర్లు అంటేనే కోట్లతో వ్యవహారం. లక్షల డిపాజిట్ చేయాలి.. కోట్లలో వేలం పాట పాడి దక్కించుకోవాలి. అన్ని కోట్లు ఉన్న గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కడ ఉన్నారు. ఆయా వర్గాల్లోని సంపన్నులకే ఆ చాన్స్ ఉంటుంది. రిజర్వేషన్లు కల్పించినా సామాన్య వర్గాలకు దీంతో ఏమాత్రం ఉపయోగం లేదని.. ఈ పథకం వృథా అని ప్రతిపక్షాలు ఆయా వర్గాల నుంచి విమర్శల వాన కురుస్తోంది.

ఇక సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించి టీకాలు వేగవంతంగా వేయాలని ఆదేశించారు. స్కూళ్లు, పాఠశాలలు ప్రారంభమైనా కూడా తెలంగాణలో కరోనా పెరగలేదని తెలిపారు.


Tags:    

Similar News