కాపులకు రిజర్వేషన్లు... జగన్ ఇచ్చేస్తున్నారా...?

Update: 2022-11-01 00:30 GMT
వచ్చే ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. అధికార వైసీపీకి ఇంకా కీలకం. ఈసారి గెలిస్తే ఇక తిరుగులేదు. తాము అనుకున్నట్లుగా మరో రెండు మూడు టెర్ములు గెలవవచ్చు. కానీ ఓడితే మాత్రం ఆ తరువాత  రాజకీయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే పంతంగానే జగన్ రాజకీయం చేస్తున్నారు. ఆయన రెండేళ్ళ ముందే తన బుర్రకు పదును పెడుతున్నారు. అవకాశాలు ఏవీ వదులుకోవడంలేదు. అదే సమయంలో సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న జగన్ ఈసారి ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహాలను  రూపొందిస్తారో అన్న ఆసక్తి అయితే ఉంది మరి.

ఇదిలా ఉంటే కాపులను ముందు పెట్టి సమావేశాలతో కధను నడిపిస్తున్న వైసీపీ రానున్న కాలంలో వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఇంకా గట్టి ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు. త్వరలో విజయవాడ వేదికగా భారీ ఎత్తున కాపుల మీటింగ్ నిర్వహించి రాజకీయ రాజధానిలోనే తొడకొట్టేందుకు రెడీ అని చెప్పనుంది అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే కాపుల విషయంలో పధకాలు పేరు చెప్పినా వారికి ఇవ్వాల్సింది ఒక్కటే ఉంది. అది రిజర్వేషన్లు. బీసీలలో కాపులను కలపడం అన్నది వారి చిరకాల కోరిక. అయితే ఆ విషయంలో తాను ఏమీ చేయలేను అని 2019 ఎన్నికల సందర్భంగానే జగన్ చెప్పేశారు. అయితే జగన్ చేతిలోనే మరో విషయం ఉంది. అది కనుక ఆయన చేస్తే కాపులు ఆయనకు బాగా దగ్గర అయ్యే అవకాశం ఉంది.

అదే ఆర్ధికంగా వెనకబడిన పేదలకు కేంద్రం పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అవకాశం ఇచ్చింది. దాని నుంచే అయిదు శాతం కాపులకు రిజర్వేషన్లు అని చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు ఇచ్చారు. ఆ మేరకు జీవో  కూడా విడుదల చేశారు. జగన్ వచ్చాక మాత్రం అది అమలు కావడం లేదు. దాని మీద కాపులు గుర్రుగా ఉన్నారు. అయిదు శాతం కనుక అమలు అయితే విద్యా ఉద్యోగాలలో అవకాశాలు మెరుగు అవుతాయని వారు భావిస్తున్నారు.

మరి జగన్ కనుక ఇపుడు ఆ అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తే కనుక అతి పెద్ద ఊరట వారికి దక్కుతుంది. అదే టైం లో రాజకీయంగా ఇది ఒక కొత్త ఎత్తుగడగా ఉంటుంది. ఈ విషయం చెప్పి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వంటి వారిని తమ పార్టీలోకి ఆహ్వానించవచ్చు. అలాగే గోదావరి జిల్లాలలో వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు పెంచుకోవచ్చు. మరి జగన్ ఆ దిశగా పావులు కదుపుతారా అన్నది ఒక చర్చగా ఉంది.

అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. కాపులను చేరదీసినట్లుగా అనిపిస్తే బీసీలు దూరం అవుతారు అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. పైగా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినా పవన్ మానియా అలాగే ఉంటే అదంతా వృధా ప్రయాస అవుతుంది. ఇక ముద్రగడ లాంటి వారు రాకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. మరో వైపు బీసీ ఓట్లు కూడా జారిపోతే మొత్తం సోషల్ ఇంజనీరింగ్ కే ముప్పు వస్తుంది. అందువల్ల ఈ విషయంలో ఆచీ తూచీ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వైసీపీకి చెందిన కాపు మంత్రులతో మీటింగులు ప్రతీ జిల్లాలో పెట్టించి కాపులకు ఏమేమి కావాలన్నది విన్నపాల ద్వారా తెలుసుకుని అందులో ఎన్ని ఆచరణలో చేయగలమో చూసి వారి మద్దతు బట్టి అడుగులు ముందుకు వేయడానికే వైసీపీ ఆలోచన చేస్తోంది అనీంటున్నారు. చూడాలి మరి వైసీపీ కాపు రాజకీయం ఎంతవరకూ పండుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News