హరీష్ ను కేసీఆర్ అందుకే దూరం పెట్టాడట..

Update: 2019-07-20 10:39 GMT
తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ తన అల్లుడైన హరీష్ రావును ఎందుకు దూరం పెట్టారు.. ఇది చాలా టఫ్ క్వచ్ఛన్. తెలంగాణ వ్యాప్తంగా ట్రబుల్ షూటర్ గా..జనం నేతగా.. మామ కేసీఆర్ కు తలలో నాలుకలా ఉండే హరీష్ ఇప్పుడు సిద్ధిపేట ఎమ్మెల్యేగానే పరిమితం అవ్వడం.. మంత్రి పదవి దక్కకపోవడం వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరిగింది.? ఈ ప్రశ్నలకు ఒక్క కేసీఆర్ కు మాత్రమే సమాధానం తెలుసు. ఆయన చెప్పరు.. మామ మాటను హరీష్ జవదాటరు.. మరి ఈ హరీష్ రాజకీయ వైరాగ్యం వెనుక అసలు నిజం ఏంటన్నంది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న..

అయితే అందరితోపాటు రాజకీయ నేతల్లో కూడా హరీష్ ను కేసీఆర్ ఎందుకు దూరంపెట్టారన్న ప్రశ్నకు సమాధానం లేదు.కానీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం హరీష్ ను దూరం పెట్టడానికి గల కారణం ఇదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి హాట్ టాపిక్ గా మారాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ పోటీచేసిన రేవంత్ రెడ్డిని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పట్టుబట్టి ఓడించాడు. ఇందులో కీలక పాత్ర పోషించింది హరీష్ రావేనన్న ప్రచారం సాగింది.. కొడంగల్ లో మకాం వేసి కేసీఆర్ అండదండలతో రాజకీయ వ్యూహాలు రచించి రేవంత్ రాజకీయ జీవితానికి కామా పెట్టారని అంటారు.. అయితే మళ్లీ రేవంత్ మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలిచారు.

తాజాగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. కొడంగల్ లో కేసీఆర్, హరీష్ లు కుట్రలు చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను ఓడించారని రేవంత్ మండిపడ్డారు. కొడంగల్ ప్రజలకు హరీష్ రావు చేసిన ద్రోహానికే ఆయన ఇప్పుడు పార్టీలో ఉండి కూడా లేనట్టుగా ప్రాధాన్యత కోల్పోయి శిక్ష అనుభవిస్తున్నారని రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. తనను ఓడించడానికే హరీష్ రావును కేసీఆర్ కొడంగల్ పంపారని.. ఎన్నికల్లో హరీష్ చేసిన ద్రోహానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని రేవంత్ విమర్శించారు. ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏమైందో ప్రజలంతా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పొట్టివాడినైన నన్ను పొడుగువాడు హరీష్ కొడితే.. ఈ పొడుగొడిని పోశమ్మ కొట్టిందన్న సామెత హరీష్ విషయంలో నిజమైందని  సెటైర్లు వేశారు.

ఇలా తన శాపం వల్లే హరీష్ ఓడిపోయాడని.. తనను అన్యాయంగా ఓడించినందుకే హరీష్ రావుకు ఆ గతి పట్టిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి.

    
    
    

Tags:    

Similar News