రేవంత్ చెబుతున్న హ్యాట్రిక్ మాటలు విన్నారా?

Update: 2016-06-11 04:31 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నోట ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉన్నప్పటికి ఆయన ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలిపి మహాకూటమి ఏర్పాటు చేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి కిందకు దింపటమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను టీడీపీ.. కొండగల్ ను వీడనని చెప్పుకొచ్చారు.

తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ నియోజకవర్గం నుంచే 2019లోనే బరిలోకి దిగుతానని.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి.. హ్యాట్రిక్ విజయంతో కొడంగల్ ప్రజల రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు.. యువతకు టిక్కెట్లు ఇచ్చి బరిలో నిలుపుతామని చెప్పిన ఆయన.. కేసీఆర్ తనపై రాజకీయంగా దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా పేర్కొన్నారు.

చిత్రమైన విషయం ఏమిటంటే.. ఏ రాజకీయ నేత కూడా మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తాం? ఎలాంటి వ్యూహం అనుసరిస్తాం? ఎవరెవరికి సీట్లు ఇస్తామన్న విషయాల్ని చెప్పరు. కానీ.. అందుకు భిన్నంగా రేవంత్ మాత్రం అన్ని చెప్పేస్తున్నారు. టిక్కెట్లు ఇచ్చే విషయమే కాదు.. అన్ని పార్టీలు కలిపి మహాకూటమిగా ఏర్పడతామన్న విషయాన్ని చెప్పటం గమనార్హం. కొడంగల్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన.. ఒక్కసారి తన నియోజకవర్గంలో సర్వే చేయించుకుంటే బాగుంటుందేమోనన్న మాటలు రాజకీయ వర్గాల నోటి నుంచి వినిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయం గురించి మాట్లాడుతున్న రేవంత్ కు.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు ఎందుకు వినిపించనట్లు..?
Tags:    

Similar News