బరువు తగ్గాలి..బాగా ఫిట్‌ కావాలి..స్టార్ పేసర్ కు బీసీసీఐ షరతు!

కారణం.. మోకాలి గాయం.. ఒకవేళ అదే లేకుంటే టీమ్ ఇండియాకు అతడు ఏడాదిలో ఎన్నో విజయాలు అందించేవాడు.

Update: 2024-11-28 16:30 GMT

సరిగ్గా నిరుడు ఈ రోజుల్లో అతడు నేషనల్ హీరో.. ప్రధాని మోదీ సైతం డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి అభినందించిన ఘనత సొంతం.. కానీ, అప్పటినుంచి మైదానంలోకి దిగలేదు. కారణం.. మోకాలి గాయం.. ఒకవేళ అదే లేకుంటే టీమ్ ఇండియాకు అతడు ఏడాదిలో ఎన్నో విజయాలు అందించేవాడు. అయితే, ఇప్పుడు దాదాపు కోలుకుని మైదానంలోకి దిగడంతో అతడు ఎప్పుడు జాతీయ జట్టులోకి వస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.

అతడు లేకుండానే..

ప్రస్తుతం బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఆడుతోంది టీమ్ ఇండియా. తొలి టెస్టులో పెర్త పిచ్ పై భారత కెప్టెన్ బుమ్రా, హైదరాబాదీ పేసర్ సిరాజ్ అదరగొట్టారు. వీరి దూకుడు చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కు మున్ముందు కష్టాలు తప్పవనే అభిప్రాయం ఏర్పడింది. కాగా, వీరిద్దరికీ తోడుగా మరో పేసర్ మహ్మద్ షమీ కూడా ఉంటే..? ఇక అభిమానులకు పండుగే.

మైదానంలోకి మళ్లీ ఎప్పుడు?

నిరుడు భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో షమీ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్ లు ఆలస్యంగా జట్టులోకి వచ్చినా మొత్తం 24 వికెట్లతో అతడు సత్తా చాటాడు. అయితే, నవంబరు 19 నాటి ఫైనల్ అనంతరం షమీ మైదానంలోకి దిగలేదు. మోకాలి గాయంతో మైదానానికి దూరమైన అతడు ఇటీవలే రంజీట్రోఫీలో బెంగాల్ తరఫున పునరాగమనం చేశాడు. సయ్యద్ ముస్తాల్ అలీ టోర్నీలోనూ ఆడుతున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నాటికి షమీని టీమ్ ఇండియాలోకి తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి మాత్రం స్పష్టత లేదు. షమీని ఇప్పుడే ఆస్ట్రేలియాకు పంపడం లేదని తెలుస్తోంది. అతడికి రెండు కండీషన్లు పెట్టిందని.. పైగా వాటికి డెడ్‌ లైన్‌ విధించిందని చెబుతున్నారు.

మూడో టెస్టు నాటికి..

డిసెంబరు 14న ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మొదలుకానుంది. అప్పటికి షమీ జట్టుతో చేరాలంటే బరువు తగ్గాలని.. పూర్తి ఫిట్‌ నెస్ సాధించాలని బీసీసీఐ తేల్చి చెప్పిందట. అంతేగాక వచ్చే ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీని కూడా పరిగణనలోకి తీసుకుని.. షమీపై ఒత్తిడి లేకుండా చూడాలని భావిస్తోందట. ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీమ్ షమీని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

Tags:    

Similar News