రేవంత్ దెబ్బ‌కు రెండుగా చీలిన టీటీడీపీ

Update: 2017-10-19 07:53 GMT

తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. టీటీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌ లో చేరాల‌ని రేవంత్ దాదాపుగా నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా తాజాగా రేవంత్ టీడీపీకి సంబంధించిన పార్టీ అంశాల‌ను - ఏపీ నేత‌ల తీరును ఎత్తిచూపారు. దీంతో తెలంగాణ టీడీపీకి చెందిన నేత‌లు రేవంత్ అనుకూల - వ్య‌తిరేక వ‌ర్గాలుగా చీలిపోయార‌ని తెలుస్తోంది.

రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తులు - పార్టీ ముందుకు సాగాల్సిన విధానం ముఖ్యంగా కాంగ్రెస్‌ తో అంట‌కాగ‌డంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను పార్టీ పొలిట్‌ బ్యూరో స‌భ్యుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు. కాంగ్రెస్‌ తో అంట‌కాగ‌డం కంటే అధికార టీఆర్ ఎస్ పార్టీతో జ‌ట్టుక‌ట్ట‌డం మేల‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు రేవంత్ చేస్తున్న పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌ను పార్టీ సీనియ‌ర్ నేత‌లైన రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి - రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి - ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌ - ఇత‌ర నేత‌లు త‌ప్పుపడుతున్నారు. అయితే పార్టీ సీనియ‌ర్లైన ఎల్‌.ర‌మ‌ణ - వేం న‌రేంద‌ర్ రెడ్డి - కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి రేవంత్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తున్నారు. త‌ద్వారా పార్టీలో చీల‌క స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా...త్వ‌ర‌లో రేవంత్‌ కు షోకాజ్ నోటీసులు జారీచేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ ప‌రువును ప‌లుచన చేసే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినందుకు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ రాబోయే వారం ప‌ది రోజుల్లో ఈ నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ ఈ ప‌రిణామంపై అచితూచి స్పందించారు. ఎన్నికలప్పుడే పొత్తులు ఉంటాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారని...ఈ నేప‌థ్యంలో ఆయన డైరెక్షన్‌ కు అనుగుణంగా పనిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పార్టీ వ్యక్తుల ఆలోచనలకు అనుగుణంగా నడవదని...సమిష్టి నిర్ణయాలే అమలవుతాయని అంటున్నారు.
Tags:    

Similar News