బ‌య‌ట‌కు రండి...ప‌ద‌వులు పొందండి

Update: 2016-11-15 10:49 GMT
తెలంగాణ పాలిటిక్స్‌ లో విచిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అధికార టీఆర్ ఎస్ కి చెందిన నేత‌లు టీడీపీలో చేరుతున్నారు. తాజాగా.. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలు కొడాలి రవికుమార్, వాసు టీడీపీ కేంద్ర కార్యాలయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వాస్త‌వానికి బెల్లం చుట్టూ ఈగ‌ల్లా.. అధికారం ఉన్న వారివైపే ఎవ‌రైనా చేర‌తారు. కానీ, ఇప్పుడు రివ‌ర్స్ గేర్‌లో టీడీపీలోకి వ‌చ్చి చేరుతుండ‌డంతో ఆ పార్టీ నేత‌ల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది.

ఈ సందర్భంగా టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనదైన శైలిలో  సీఎం కేసీఆర్‌.. ఆయ‌న త‌న‌యుడు మంత్రి కేటీఆర్‌ ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు.  తండ్రి రాష్ట్రాన్ని - కొడుకు హైదరాబాద్‌ తో పాటు పురపాలకశాఖను నాశనం చేస్తున్నారని కేసీఆర్ - కేటీఆర్ ల‌ను ఏకేశారు. మంత్రి కేటీఆర్ జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ లో తిరిగి మౌలిక వసతులను వంద రోజుల్లో పూర్తిగా మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారని రేవంత్‌ గుర్తుచేశారు.

 కేటీఆర్ పర్యటించగానే ఇక పరిస్థితి మొత్తం మారిపోతుందని సీఎం కేసీఆర్ ప్రశంసించారని, అయితే, 100 రోజులు దాటినా నగరంలో పరిస్థితులు మెరుగుపడకపోగా ఇంకా అధ్వానంగా మారాయని ఆరోపించారు. నగరంలో రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోందని ధ్వజమెత్తారు.  హైదరాబాద్లో ప్రస్తుతం కనిపించే అభివృద్ధి మొత్తం టీడీపీ హయాంలో చేసిందేనని చెప్పారు. అయితే, ఇప్పుడిప్పుడే.. ప్రజలతో పాటు నాయకులు కూడా టీఆర్ ఎస్ - కేసీఆర్ ప్ర‌భుత్వ‌ వైఫల్యాలను గ్రహిస్తున్నారని దీంతో టీడీపీలోకి మళ్లీ వచ్చి చేరేవారి సంఖ్య పెరుగుతోందని రేవంత్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

 ఇక‌, ఇదే స‌మ‌యంలో రేవంత్ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరి ప్రస్తుతం అక్కడ ఇమడలేక ఆపార్టీ నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతున్న నాయకులు టీడీపీలోకి వస్తే ఇదివరకు ఉన్న హోదా - గౌరవాలు యధాతథంగా ఉంటాయని  హామీ ఇచ్చారు. కేసీఆర్ మాయమాటలను నమ్మి తల్లిలాంటి టీడీపీని వీడి టీఆర్ ఎస్ లోకి వెళ్లారని - తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఆయన పిలుపు నిచ్చారు. టీఆర్ ఎస్ నుంచి టీడీపీకి వచ్చిన కొడాలికి తెలుగుయువతలో మంచి పదవిని ఇస్తామని హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News